వాట్సాప్‌లో కరోనాపై తప్పుడు ప్రచారం

24 Mar, 2020 04:09 IST|Sakshi
విజయ్‌కుమార్, బాల్‌రాజ్‌

పోస్టు చేసిన వ్యక్తితోపాటు గ్రూప్‌ అడ్మిన్‌ అరెస్టు

రాష్ట్రంలోనే మొదటి కేసు

బషీరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరు లోని జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళకు కరోనా సోకిందని వాట్సాప్‌ గ్రూపులో తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బషీరాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం జరిగిందని ఎస్పీ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. అయితే ఆమెకు కరోనా సోకిందని, తాండూరులో మొదటి కేసు నమోదైందంటూ కొర్విచెడ్‌ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌ సోమవారం  తెల్లవారుజామున ఓ వాట్సాప్‌ గ్రూపులో తప్పుడు పోస్టు పెట్టాడు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ విభాగం సిబ్బంది విచారణ జరిపి విజయ్‌కుమార్‌ను గుర్తించారు. వెంటనే అతడితోపాటు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్న బాల్‌రాజ్‌పై ఐపీసీ 188తో పాటు సెక్షన్‌ 54 ఎన్‌డీఎంఏ కింద చట్టాల కింద కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టుచేశారు. కాగా గ్రూప్‌ అడ్మిన్‌ బాల్‌రాజ్‌ ఓ వెబ్‌ చానల్‌ రిపోర్టర్‌. ఎవరైనా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారంపై నమోదైన కేసు రాష్ట్రంలోనే ఇదే మొదటిదని పోలీసు వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు