చిన్నారులను చిదిమేసిన స్కూల్‌ వ్యాన్‌ 

28 Feb, 2020 03:59 IST|Sakshi
వివేక్, గౌతమ్, విశాల్‌తో తండ్రి రమేశ్‌ (ఫైల్‌). వీరిలో వివేక్, గౌతమ్‌ మృతిచెందారు

బైక్‌పై నుంచి కిందపడిన వైనం..వెనుక నుంచి దూసుకొచ్చిన వ్యాన్‌

ఇద్దరు మృతి.. తండ్రి, మరో కుమారుడి పరిస్థితి విషమం 

యాచారం: మరికాసేపట్లో బంధువులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు అంతలోనే మృత్యుఒడికి చేరారు. శుభకార్యానికి వెళ్తూ వ్యాన్‌ కింద చితికిపోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం అనుబంధ గాండ్లగూడెంకు చెందిన బెల్లి రమేశ్, రజిత దంపతులకు వివేక్‌ (14), గౌతమ్‌ (9), విశాల్‌ సంతానం. వీరిలో వివేక్‌ 9, గౌతమ్‌ 2వ తరగతి చదువుతున్నారు. యాచారంలో జరిగే ఓ శుభాకార్యానికి గురువారం రమేశ్‌ తన కుమారులతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మొండిగౌరెల్లి చౌరస్తాకు రాగానే ఓ వృద్ధుడు స్కూటీతో వీరిని ఢీకొట్టాడు. అప్పటికే వేగంగా వెళ్తున్న రమేశ్‌ అదుపుతప్పి పిల్లలతో పాటు కిందపడిపోయాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన పాఠశాల వ్యాన్‌.. చిన్నారుల మీదుగా వెళ్లింది. వివేక్, గౌతమ్‌ వ్యాన్‌ చక్రాల కింద చితికి అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన తండ్రి రమేశ్‌.. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాడు. మరో కుమారుడు విశాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వివేక్, గౌతమ్‌ మృతదేహాలను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. రమేశ్, విశాల్‌ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల వ్యాన్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కాగా, బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. చిన్నారులు రక్తపుమడుగులో పడి ఉండడం చూసి బోరున విలపించారు. ఈ ప్రమాదంతో నాగార్జునసాగర్‌– హైదరాబాద్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు