మింగేసిన బావి

14 Sep, 2019 09:30 IST|Sakshi
మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

నూతిలో ఇటుకలు తీస్తూండగా ఇద్దరు సజీవ సమాధి

కాకినాడలో దుర్ఘటన ∙కన్నీరు మున్నీరైన బంధువులు

రోజూ మాదిరిగానే ఉపాధి కోసం కూలి పనికి వెళ్లిన వారు అక్కడే సజీవ సమాధి అయిపోయారు. పాడుబడిన ఓ బావిని పూడ్చే యత్నంలో.. మీద పడిన మట్టిపొరల్లో చిక్కుకుపోయి మృత్యులోకాలకు చేరుకున్నారు. కాకినాడలోని ఓ ఇంట్లో బావిని పూడ్చేందుకు శుక్రవారం ఇటుకలు తీస్తూండగా.. ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలైన ఘటన అయినవారికి విషాదాన్ని మిగిల్చింది.

సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : కాకినాడ ఎస్‌.అచ్యుతాపురం రైల్వేగేటు సమీపంలోని ద్వారకానగర్‌లో పాడుబడిన నుయ్యిని మూసే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో ఎస్‌.అచ్యుతాపురం ద్వారకానగర్‌కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ (42), కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను(45) మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..  ద్వారకానగర్‌లోని గుర్రాల లక్ష్మీకాంతానికి చెందిన స్థలంలో 50 ఏళ్ల పైబడిన 15 అడుగుల పురాతన నుయ్యి ఉంది. దీనిని పూడ్చేందుకు నిర్ణయించిన లక్ష్మీకాంతం మొదట మట్టి వేసి మూసివేయాలని ప్రయత్నించారు. ఎవరో అలా చేయకూడదని చెప్పడంతో తనకు తెలిసిన వాస్తు సిద్ధాంతి సలహా తీసుకున్నారు. ఆయన కూడా నూతిని నేరుగా పూడ్చకూడదని, ఉన్న ఇటుకలు, తీసివేసి అప్పుడు మూసివేయాలని చెప్పడంతో ఆ ప్రకారం లక్ష్మీకాంతం తన సమీప బంధువు తాపీమేస్త్రీ అయిన ఎస్‌ అచ్యుతాపురం ద్వారకానగర్‌కు చెందిన గోడసకుర్తి సత్యనారాయణ(42)కు పని పురమాయించారు. దీంతో సత్యనారాయణ తన వద్ద పని చేస్తున్న కరప మండలం పెద్దాపురప్పాడు సలాది శ్రీను (45)తో కలసి గురువారం నుంచి నూతిలోని ఇటుకలను తీసివేసే పనులు ప్రారంభించారు. శుక్రవారం కూడా యథావిధిగానే ఆ పనులు చేపట్టారు.

మధ్యాహ్న సమయంలో ఇంటి యజమాని గుర్రాల లక్ష్మీకాంతం పనుల పరిశీలనకు ఆ ప్రాంతానికి రాగా అక్కడ పని చేస్తున్న సత్యనారాయణ, శ్రీను కనిపించలేదు. నుయ్యిలోని మట్టి అండలు కూలిపోయి ఉండడంతో ఆందోళనకు గురైన లక్ష్మీకాంతం టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి నుయ్యిలో పూడుకుపోయిన అండలను తీసే కార్యక్రమాన్ని చే³ట్టారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రత్యేక క్రేన్‌ల సాయంత్రం మట్టి అండలను, ఇటుకలు తీసే పనులను ప్రారంభించారు. చివరకు రాత్రి 7.30 గంటల సయమంలో నూతిలో సజీవ సమాధి అయిన సత్యనారాయణ, శ్రీను మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలు అక్కడకి చేరుకొని మృతదేహాలను తరలించేందుకు వీల్లేదని, తమ కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. ఈ సంఘటనపై టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు గోడసకుర్తి సత్యనారాయణకు భార్య ఉమామహేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉండగా, సలాది శ్రీనుకు భార్య  ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయని బంధువులు చెబుతున్నారు.


 బావిలో మట్టిపెళ్లలు తొలగించి, కూలీల మృతదేహాలను వెలికితీస్తున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది

మరిన్ని వార్తలు