సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాల డిమాండ్‌

19 Jan, 2020 04:38 IST|Sakshi

హైదరాబాద్‌ వాసి సహా ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

సీబీఐ ప్రధాన కార్యాలయం ఫోన్‌ నంబర్‌ స్పూఫ్‌ చేసిన నిందితులు

సాక్షి, న్యూఢిల్లీ: తాము సీబీఐ ఉన్నతాధికారులమని పరిచయం చేసుకుని సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాలు డిమాండ్‌ చేసిన వ్యవహారంలో హైదరాబాద్‌ వాసి సహా ఇద్దరిని అరెస్టు చేసింది. దీనిపై జనవరి 16న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి నిందితులు హైదరాబాద్‌ నివాసి వై.మణివర్దన్‌ రెడ్డి, తమిళనాడులోని మధురై నివాసి సెల్వం రామరాజ్‌ సహా పలువురు ఇతరులు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకును మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని వారు సంప్రదించి ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులుగా చెప్పుకొంటూ భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేశారు.

ఈ ఇద్దరు నిందితులు మోసపూరితమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ల్యాండ్‌ లైన్‌ టెలిఫోన్‌ నంబర్‌ 011–24302700 ద్వారా ఫోన్‌ చేసినట్టు ఆరోపణలు తెలుస్తోంది. తమను సీబీఐ అధికారులుగా చెప్పుకొంటూ పలుమార్లు బ్యాంకు మోసం కేసులోని నిందితుడి మొబైల్‌కు ఫోన్‌ చేశారు. జనవరి 4న వై.మణివర్దన్‌రెడ్డి ఏకంగా గుంటూరు వెళ్లి అతణ్ని వ్యక్తిగతంగా కలిసి రెండు రోజుల్లో అడిగిన మేరకు లంచం ఇవ్వనిపక్షంలో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు చెన్నైలో రెండు చోట్ల, హైదరాబాద్, మధురై, శివకాశిల్లో ఒక చోట తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక మొబైల్‌ ఫోన్లు, నేరానికి చెందిన వాట్సాప్‌ సంభాషణలు, డాక్యుమెంట్లు లభించాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ శనివారం వెల్లడించింది.

మరిన్ని వార్తలు