తెల్లారిన బతుకులు

14 Sep, 2019 07:48 IST|Sakshi
ప్రమాదానికి గురైన వాహనం

మంగళగిరి వద్ద ఇద్దరు జిల్లావాసులు దుర్మరణం

ఆగివున్న కంటైనర్‌ ను ఢీకొట్టిన వాహనం 

సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం): వారం వారం గుంటూరు వెళతారు.. అక్కడి నుంచి బలిష్టమైన గొర్రెలను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తారు.. హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళితే నాలుగు డబ్బులు మిగులుతాయన్నది వారి ఆశ.. అందుకే రాత్రి బయలుదేరి తెల్లారేసరికల్లా అక్కడికి చేరుకోవాలనుకున్నారు. గంటలో గమ్యస్థానం చేరుతామనగా చీకటి తెరలు వీడకుండానే రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన కోటిపల్లి శాంతారావు (25), జలుమూరు మండలం మాకివలసకు చెందిన బోర కన్నయ్య (48), శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరివానిపేటకు చెందిన కింతలి సింహాచలం (వాహన యజమాని), శ్రీకాకుళం రూరల్‌ మండలం శిలగాం సింగివలసకు చెందిన కురిటి అప్పన్న, చొట్టవానిపేటకు చెందిన మురపాక శ్రీను గుంటూరులో గొర్రెలమండికి వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసేందుకు టాటా మ్యాజిక్‌ వాహనంలో గురువారం రాత్రి బయల్దేరారు. మధ్యలో మరో యువకుడు వాహనాన్ని ఎక్కాడు.

శుక్రవారం తెల్లవారుజామున మరో గంటలో గుంటూరులోని గొర్రెలమండి చేరుకోవాల్సి ఉండగా, జాతీయరహదారిపై పక్కన ఆపివున్న కంటైనర్‌ను వాహనం అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ సహా ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్‌ పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో కోటిపల్లి శాంతారావు గోరా కన్నయ్యలతో పాటు మధ్యలో ఎక్కిన గుర్తు తెలియని యువకుడు ఉన్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

పెళ్లయిన నాలుగు  నెలలకే..
మృతుల్లో కోటిపల్లి శాంతారావుకు నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. ఆమదాలవలస మండలం సొట్టోడుపేటలో ఉన్న తన భార్య మాధవి ఇంటి నుంచి దసరాకు గొర్రెలు కొనుగోలుకు లగేజి వాహనంపై బయల్దేరాడు. శాంతారావు నడగాంలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రమాద ఘటన తెలియడంతో రెండు గ్రామాల్లోనూ విషాదం అలుముకుంది. గుండె నిండా విషాదం నింపుకొని శాంతారావు తల్లిదండ్రులు బారికి వాడు, సూరమ్మలతోపాటు భార్య మాదవిలు హుటాహుటిన మంగళగిరి వెళ్లారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా