ఆస్ట్రేలియాలో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి

19 Dec, 2018 01:33 IST|Sakshi
పిల్లలతో రహత్‌.. జువేద్‌.. గౌసొద్దీన్‌

మరొకరు గల్లంతు.. 

ఒకరు నల్లగొండ, మరొకరు హైదరాబాద్‌ వాసి 

ఓ కుటుంబాన్ని కాపాడే క్రమంలో విషాదం  

నల్లగొండ క్రైం/రామచంద్రాపురం (పటాన్‌చెరు): విహారయాత్ర ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది. ఆస్ట్రేలియాలోని మోనోబీచ్‌కు వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు, హైదరాబాద్‌కు చెందిన మరొకరు మృతిచెందగా ఇంకొకరు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్కకు చెందిన గౌసుద్దీన్‌ (45) అతని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో మూడేళ్లుగా నివాసముంటున్నాడు. గౌసుద్దీన్‌కు వరుసకు అల్లుడైన జువేద్‌ (26) ఆస్ట్రేలియాలోనే ఎంఫార్మసీ చదువుతూ పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్నాడు. వీరి సమీప బంధువు బీహెచ్‌ఈఎల్‌కు చెందిన రాహేత్‌ (35) కూడా సిడ్నీలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. క్రిస్‌మస్‌ సెలవులు కావడంతో ఆదివారం గౌసుద్దీన్‌తో పాటు అతని భార్య, ముగ్గురు పిల్లలు, రాహేత్, జువేద్‌ కలిసి న్యూ సౌత్‌వెల్స్‌లోని మోనో బీచ్‌కు వెళ్లారు. గౌసుద్దీన్‌ భార్య పిల్లలు బీచ్‌ ఒడ్డున ఉండగా.. గౌసుద్దీన్, జువేద్, రాహేత్‌ ముగ్గురూ పడవపై సముద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి ఓ కుటుంబం సముద్రంలో చిక్కుకుంది. వారిని కాపాడే క్రమంలో గౌసుద్దీన్, రాహేత్‌ మృతిచెందగా, జువేద్‌ గల్లంతయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిచెందిన గౌసుద్దీన్‌ కుటుంబ సభ్యులను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి పరామర్శించారు.  

కుటుంబాల్లో విషాదం.. 
గౌసుద్దీన్‌ తండ్రి సబ్జద్‌ అలీ ఎస్సైగా పదవీ విరమణ చేసి మాన్యంచెల్కలో నివాసముంటున్నారు. జువేద్‌ కుటుంబం నల్లగొండలోని శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటుంది. జువేద్‌ తండ్రి రషీద్‌ రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నాడు. కుమారుడు ఉన్నతస్థాయిలో స్థిరపడాలని ఎంఫార్మసీ విద్య కోసం రెండేళ్ల కింద జువేద్‌ను ఆస్ట్రేలియాకు పంపాడు. కానీ బీచ్‌కు వెళ్లి గల్లంతయ్యాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ విద్యుత్‌నగర్‌కు చెందిన రాహేత్‌ బోటు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి అతని కుటుంబం నివాసం ఉంటున్న విద్యుత్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహెచ్‌ఈఎల్‌ రిటైర్డ్‌ కార్మికుడు సయ్యద్‌ అమీనొద్దీన్‌కు రెండో సంతానం రాహేత్‌. నాలుగేళ్ల కిందట కుటుంబ సభ్యులతో కలిసి రాహేత్‌ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు. అందులో ఆరు నెలల చిన్నారి కూడా ఉంది.  
 

మరిన్ని వార్తలు