బైక్‌ దొంగల అరెస్టు

11 Feb, 2018 13:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ పాలరాజు(వెనుక ముసుగులో నిందితులు)

పది బైక్‌ల స్వాధీనం : ఎస్పీ

విజయనగరం టౌన్‌: జిల్లాలో మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న  ఇద్దరు నేరస్తులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ. 5 లక్షల విలువైన  పది మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని  ఎస్పీ జి.పాలరాజు తెలిపారు.   జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో  శనివారం సంబంధిత  వివరాలను వెల్లడించారు.  ఇటీవలి కాలంలో మోటారు సైకిళ్ల దొంగతనాలు ఎక్కువ కావడంతో సీసీఎస్‌ పోలీసులతో రైల్వేస్టేషన్, ఇతర ముఖ్య మైన కూడళ్లలో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా అంతర్‌ జిల్లా నేరస్తులైన  ద్వారపూడికి చెందిన  బెల్లాన బాలరాజు,  బొబ్బిలికి చెందిన పెంకి గంగరాజులను సీసీఎస్‌ పోలీస్‌ టీమ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద  అదుపులోకి తీసుకుంది. అరెస్ట్‌ అయిన బాలరాజు నుంచి రూ.మూడు లక్షల విలువైన   ఆరు మోటార్‌ బైక్స్,  గంగరాజు నుంచి  రూ.2లక్షలు విలువైన  నాలుగు బైక్స్,  స్వాధీనం చేసుకున్నామన్నారు.   బాలరాజు వన్‌టౌన్‌ పరిధిలో మూడు నేరాలు, నెల్లిమర్ల, జామిలో ఒక్కొక్క నేరం, విశాఖ సిటీ ఐదో టౌన్‌లో ఒక నేరానికి పాల్పడ్డాడని తెలిపారు. గంగరాజు పెదమానాపురం పరిధిలో ఒకటి, బొబ్బిలిలో ఒకటి, పార్వతీపురం పట్టణంలో రెండు నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు.

సిబ్బందికి ప్రోత్సహకాలు
నేరస్తులను అరెస్టు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సీసీఎస్‌ డీఎస్పీ ఎఎస్‌.చక్రవర్తి, నెల్లిమర్ల ఎస్‌ఐ హెచ్‌.ఉపేంద్ర, పెదమానాపురం ఎస్‌ఐ కెఎస్‌కెఎన్‌జె.నాయుడు, సీసీఎస్‌ ఎస్‌ఐలు ఐ.రాజారావు, నాయుడు, హెచ్‌సీలు ఎమ్‌.హరి, ఎమ్‌.రమణ, కానిస్టేబుల్‌ ఎ.రమేష్, జి.కాశీరాజు, ఇతర పోలీస్‌ సిబ్బందిని ఏస్పీ ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు రివార్డులను అందజేశారు.

పత్రాలను చూపించి బైక్‌లను తీసుకెళ్లండి
బైక్‌లు పోయాయని ఫిర్యాదులు చేసిన వారందరూ తమ బైక్‌లను చూసుకుని అందుకు సంబంధించిన పత్రాలను చూపించి బైక్‌లు తీసుకెళ్లాలని ఎస్పీ సూచించారు.  సరైన ఆధారాలు లేకుండా  బైక్‌లు ఉన్నాయని, ఫిర్యాదుదారులు ఎవరైనా  దొరికిన వాటిని గుర్తించి, పత్రాలను చూపించి పట్టుకెళ్లవచ్చన్నారు.

మరిన్ని వార్తలు