వ్యసన పరులు.. చోరీల్లో మహా ముదుర్లు!

18 Jun, 2020 08:24 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీకి గురైన బైక్స్, నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడుతున్న ఎస్పీ

ఆరుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు!

రూ.11లక్షల విలువైన 17 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం

తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి వెల్లడి

తిరుపతి క్రైం : మోటార్‌ సైకిళ్ల దొంగలను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.11లక్షల విలువగల 17 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అవుల రమేష్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపిన వివరాలు..కొన్ని రోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాలలో 17 మోటారు సైకిళ్లు చోరీకి గురయ్యాయి. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదుయ్యాయి. మోటార్‌ సైకిళ్ల దొంగల భరతం పట్టేందుకు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో లభించిన కొన్ని క్లూల ఆధారంగా మంగళవారం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే చోరీల బాగోతం బైటపడింది.

మొత్తం ఆరుమంది సభ్యుల ముఠాగా ఏర్పడి మోటార్‌ సైకిళ్ల చోరీకి పాల్పడినట్లు తేలింది. దీంతో మిగిలిన నిందితులనూ అరెస్ట్‌ చేశా రు. వీరిలో మైనర్లు కూడా ఉండటం గమనార్హం! ప్రాథమిక విచారణలో తిరుపతి బొమ్ముగుంటకు చెందిన ఎస్‌.దేవేంద్ర కుమారుడు సాకే దినేష్‌ (18), అదే ప్రాంతానికి చెందిన రామ్మోహన్‌రెడ్డి కుమారుడు పురుషోత్తమరెడ్డి అలియాస్‌ బాబురెడ్డి (22), జీడీ నెల్లూరు మండలం ఆంబోధరపల్లెకు చెందిన చెందిన సోము కుమారుడు వంశీ(17), పి.సోము కుమారుడు చంద్ర(20), తిరుపతి మంగళం తిరుమల నగర్‌కు చెందిన స్వామి కుమారుడు బసవవంశీ(19), చిత్తూరులోని పలమనేరు రోడ్డులో నివాసముంటున్న పయణి కుమారుడు విక్రమ్‌ (17) అని తేలింది. వీరిని తిరుపతి వైకుంఠం ఆర్చి సమీపంలో ఎస్వీయూ పోలీ సు స్టేషన్‌ సీఐ రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. కేసును ఛేదించిన సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారి నరసప్ప, ఎస్వీ యూ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర, ఎస్‌బీ టీమ్‌ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు ప్రకటించారు.

పలు స్టేషన్లలో కేసులు
నిందితులపై కోడూరు, మదనపల్లె, రేణిగుంట, ఆర్‌సిపురం, తిరుచానూరు, తిరుపతి ఈస్టు పోలీసు స్టేషన్, ముత్యాలరెడ్డిపల్లె పోలీ సు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మోటారు సైకిళ్లను పా ర్కింగ్‌ చేసిన ప్రతిచోట ముందు చక్రానికి లాక్‌  చేసుకోవాలని, మోటార్‌ మెకానిక్స్‌ కూడా తమ వద్దకు రిపేరు, సర్వీసు నిమిత్తం వచ్చే బైక్స్‌ తీసుకువచ్చే వారికి ఫ్రంట్‌వీల్‌ లాక్‌ వినియోగించేలా చెప్పాలని సూచించారు.

తల్లిదండ్రులూ! పిల్లలపై ఓ కన్నేయండి
మోటార్‌ సైకిళ్ల దొంగలు దురలవాట్లకు, విలాసాలకు అలవాటుపడి చోరీలు, నేరాలకు పాల్పడ్డారని, ఇది సమాజానికి మంచిది కాదని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించకపోతే భారీమూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు