టిప్పర్‌ ఢీకొని అత్తాకోడళ్లు మృతి 

24 Nov, 2019 04:23 IST|Sakshi

ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం రూరల్‌: మృత్యువు టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చి అత్తాకోడళ్లను బలి తీసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నరేందర్‌ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివసించే కొత్తపల్లి రమ (56) ఆంధ్రాబ్యాంకు క్యాషియర్‌. ఆమె కుమారుడు సంతోష్‌ కౌటిల్యకు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బల్కాపురం గ్రామానికి చెందిన హిమజ (28)తో ఫిబ్రవరిలో వివాహం చేశారు. సంతోష్‌ హైదరాబాద్‌లోని డెల్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుండగా హిమజ గృహిణిగా ఉంటోంది. శనివారం లైసెన్స్‌ రెన్యువల్‌ కోసం కొత్తపేట నుంచి ఇబ్రహీంపట్నం ఆర్‌టీఏ కార్యాలయానికి అత్తాకోడళ్లు స్కూటీపై బయల్దేరారు. రమ హెల్మెట్‌ ధరించి స్కూటీ నడుపుతుండగా హిమజ వెనకాల కూర్చుంది. రాగన్నగూడ రైస్‌ మిల్లు వద్దకు రాగానే వెనకాలే ఇబ్రహీంపట్నం వస్తున్న టిప్పర్‌ (టీఎస్‌ 12 యూబీ 2673) వీరిని వేగంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ మీద నుంచి పడిపోయిన అత్తాకోడళ్లు టిప్పర్‌ వెనుక చక్రాల కింద పడి నలిగిపోయారు. టిప్పర్‌ ఇద్దరిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రమ భర్త గతంలోనే మృతిచెందాడు. మృతదేహాలను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ నరేందర్, ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు. ప్రమాదంలో తల్లి, భార్య మృతితో సంతోష్‌ కన్నీరుమున్నీరయ్యాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా