రౌడీషీటర్‌ చేతిలో ఒకరు.. భర్త చేతిలో మరొకరు

8 Oct, 2019 09:13 IST|Sakshi
మృతిచెందిన విజయలక్ష్మి, హత్యకు గురైన అనిత  

ఇద్దరు మహిళల దారుణహత్య 

క్షణికావేశంలో చోటు చేసుకున్న హత్యలు

కోపంతో భార్యను చంపిన భర్త 

అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు 

సాక్షి, కర్నూలు : ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగరంలోని బుధవారపేటలో నివాసం ఉంటున్న మంగలి సుశీల కూతురు విజయలక్ష్మి (32) అలియాస్‌ కవితకు అదే కాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్‌ కుందేలు బాబు రూ.10వేలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలంగా ఆమెతో సహజీవనం కూడా  చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సుశీల నేత్రాలయం వద్ద ఉన్న కల్లుపెంటలో ఇద్దరూ కలిసి కల్లు తాగి డబ్బుల విషయమై ఘర్షణ పడ్డారు.

ఈలోగా ఆమె భర్త అంజి అక్కడికి చేరుకున్నాడు. డబ్బుల విషయంలో మాటామాటా పెరగడంతో కుందేలు బాబు తీవ్ర కోపానికి లోనై తన వద్ద ఉన్న కత్తితో విజయలక్ష్మిని విచక్షణారహితంగా పొడిచారు.   భర్త అంజి విడిపించేందుకు ప్రయత్నించగా అతనిపై కూడా దాడికి యత్నించడంతో  పారిపోయాడు. ఈలోగా బ్లూకోల్డ్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని భర్త అంజి సహాయంతో విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ ఆమె కోలుకోలేక కొద్దిసేపటికే మృతి చెందింది. కుందేలు బాబుపై దాదాపు 10కి పైగా కేసులున్నాయి. మూడవ, నాలుగవ   పట్టణ పోలీసుస్టేషన్‌లలో అతనిపై హత్యాయత్నం, దొంగతనం వంటి కేసులు అనేకం.  డబ్బుల కోసం మహిళను దారుణంగా హత్య చేయడంతో క్యూఆర్‌టీ పోలీసులు రాత్రంతా గాలించి బాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు మూడవ పట్టణ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.  

పండుగకు ఊరికి రానన్నందుకు.. 
కోసిగి: మండల కేంద్రం కోసిగికి చెందిన పింజరిగేరి ఈరన్న, పార్వతి దంపతుల మూడవ కుమార్తె అనితకు  13 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన ఆకుల కేశవ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరద్దరికి ఉదయ్‌ హర్షిత్, సాయి విద్యశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు ఏడాది క్రితం  తాడిపత్రి వదిలి    కోసిగికి వచ్చారు. అనిత తల్లిదండ్రుల నివాసానికి కొద్ది దూరంలోనే అద్దెకు ఇళ్లు తీసుకున్నారు. ఆకుల కేశవ్‌  ఓ ప్రైవేట్‌ వాటర్‌ ప్లాంట్‌లో దినసరి కూలీగా పని చేస్తుండగా ఆమె ఇంటి వద్ద కుట్టుమిషన్‌ కుడుతూ జీవిస్తున్నారు.  ఆదివారం రాత్రి  దసరా పండుగకు  తాడిపత్రికి   వెళ్దామని భర్త  చెప్పడంతో  అందుకు ఆమె  నిరాకరించింది. ఈవిషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

చెప్పిన మాట వినవంటూ క్షణికావేశంలో కేశవ్‌.. పక్కనున్న  రాయి తీసుకుని  భార్య  తలపై బాదాడు. అంతటితో ఆగకుండా కుట్టుమిషన్‌ కత్తెరతో గొంతులో పొడిచాడు. అరుపులకు ఇంట్లో నిద్రిస్తున్న  పిల్లలు  లేచి  అవ్వాతాతకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి  అనిత తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు విడిచింది.  దీనిపై మృతురాలి తండ్రి ఈరన్న ఫిర్యాదు మేరకు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ధనుంజయలు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి మృతితో ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు.   

మరిన్ని వార్తలు