కోనేరులో ఇద్దరు యువకులు మృతి..

27 Jun, 2019 10:22 IST|Sakshi

సాక్షి, పిచ్చాటూరు(చిత్తూరు) : కోనేరులో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మండలంలోని రామగిరి కోనేరులో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రామాంజనేయులు కథనం మేరకు.. పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు గ్రామానికి చెందిన పురుషోత్తం, రేఖ దంపతుల ఏకైక కుమారుడు జి.మహేంద్రన్‌(20) చెన్నైలోని ట్రిపుల్‌ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన నాగూర్‌ కుమారుడు ఆర్‌.విజయ్‌(21) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాడు. మహేంద్రన్, విజయ్‌లు స్నేహితులు. మహేంద్రన్‌ కళాశాలకు సెలవులు కారణంగా వారం కిందట స్వగ్రామమైన అడవికొడియంబేడుకు వచ్చాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ వలంటీర్ల పోస్టుకు దరఖాస్తు చేయాలని విజయ్‌ నిశ్చయించుకున్నాడు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకునేందుకు స్నేహితుడు మహేంద్రన్‌తో కలిసి మంగళవారం ఉదయం ద్విచక్రవాహనంపై పిచ్చాటూరుకు బయలుదేరారు. 

‘వస్తున్నానమ్మా’..!
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వెళుతున్న స్నేహితునితో పాటు మీసేవ కేంద్రానికి బయలుదేరిన కుమారుడు మహేంద్రన్‌ రాత్రి 8గంటలైనా రాకపోవడంతో తల్లి రేఖ ఫోన్‌ చేసింది. ’వస్తున్నాన మ్మా..’ అని మహేంద్రన్‌ సమాధానమిచినట్లు ఆమె తెలిపింది. కానీ, ఉదయం వరకు ఇద్దరూ రాకపోవడంతో కుమారుల కోసం ఇద్దరి తల్లిదండ్రులు వెతికారు. ఉదయం 9గంటల సమయంలో తమ కుమారులు రామగిరి కోనేరులో శవాలై తేలి ఉన్నారని చుట్టుపక్కలవారు చెప్పడంతో హతాశులయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కోనేరు ఒడ్డున విగతజీవులుగా పడి ఉన్న కుమారులను చూసి బోరుమని విలపించారు. వారి ఆర్తనాదాలను చూసి చుట్టుపక్కల వారి కళ్లు చెమ్మగిల్లాయి.

మొదటి శవం తేలిన గంటలో మరో శవం..
రామగిరి కోనేరులో స్థానికులు తాగునీరు తెచ్చుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఉదయం నీటికోసం వెళ్లిన స్థానికులకు మొదటగా విజయ్‌ శవం తేలుతూ కనపడింది. వెంటనే పిచ్చాటూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. గంట తరువాత మహేంద్రన్‌ శవం పైకి రావడం గుర్తించిన స్థానికులు చలించిపోయారు. పోలీసుల సహకారంతో రెండు శవాలను ఒడ్డుకు చేర్చారు. సంఘటన స్థలాన్ని పుత్తూరు డీఎస్పీ సౌమ్యలత, సీఐ దైవప్రకాష్, ఎస్‌ఐ రామాంజనేయులు, ఆలయ ఈఓ రవీంద్రరాజు, వీఆర్‌ఓ విశ్వనాథం పరిశీలించారు. పోలీసులు శవాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

యువకుల మృతిపై పలు అనుమానాలు..
రామగిరి కోనేరులో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటనపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలు ఒడ్డుకు చేర్చిన తరువాత ముక్కులో, నోట్లో ఇద్దరికీ రక్తస్రావం తీవ్రంగా జరగడం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా మహేంద్రన్‌ తన తల్లితో మంగళవారం రాత్రి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. అయితే అతని ఫోన్‌ గానీ, విజయ్‌ గానీ కనబడటం లేదు. మంగళవారం అష్టమి. ప్రతి అష్టమికి రామగిరి వాలీశ్వర స్వామి ఆలయం, కోనేరు వద్ద రాత్రి 9 వరకు జనసంచారం ఉంటుంది. మరి వీరు ఎప్పుడు కోనేరులో దిగారో తెలియడం లేదు. విజయ్‌కు ఈత వచ్చని.. మరి కోనేరులో ఎందుకు మునిగిపోయాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి పడేశారా..? ఆత్మహత్య చేసుకున్నారా..? మద్యం తాగి కోనేరులో దిగి మరణించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు