‘అమ్మ’ను పది ముక్కలుగా నరికారు..

31 Jan, 2018 02:14 IST|Sakshi
1.హత్యకు గురైన అనూష ఫైల్‌ ఫొటో 2. గోనె సంచిలో మహిళ మృతదేహం

హయత్‌నగర్‌లో యువతి దారుణ హత్య..

ఉద్యోగం కోసం వచ్చి శవమైంది.. 

ముగ్గురిని నేనే చంపేశా- నిందితుడు మధు

సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నాం: మాదాపూర్‌ ఏసీపీ

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి/హయత్‌నగర్‌/చందానగర్‌: మానవత్వాన్ని మంటగలుపుతూ రాష్ట్ర రాజధానిలో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా.. కన్న కూతురనే ధ్యాస లేకుండా.. ఉద్యోగం కోసం వచ్చిన యువతిపై దయ చూపకుండా.. అత్యంత పాశవికంగా హత్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో ముగ్గురి దారుణ హత్యను మరువక ముందే బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో నిండు గర్భిణిని ముక్కలుముక్కలుగా నరికి రెండు బస్తాల్లో కుక్కి నడి రోడ్డుపై విసిరేసిన ఘటన మంగళవారం కలకలం సృష్టించింది. మరోవైపు బీటెక్‌ చదివి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చిన ఓ యువతి హయత్‌నగర్‌లో శవమై కనిపించింది. చందానగర్‌లో సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి, కన్న కూతురిని హత్య చేసింది తానేనని నిందితుడు మధు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

‘అమ్మ’ను పది ముక్కలుగా నరికారు.. 
మంగళవారం ఉదయం 9 గంటల సమయం. కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌ నైట్‌ సఫారీ గేట్‌ సమీపంలోని ప్రధాన రహదారి. రెండు బస్తాల నుంచి ముక్కుపుటాలు అదిరిపోయేలా వెలువడుతున్న దుర్వాసన. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్తాల్లో ఏముందో అని చూస్తే.. గుర్తుతెలియని ఎనిమిది నెలల గర్భిణి(30–35 ఏళ్ల వయసు)ని అత్యంత పాశవికంగా హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేశారు. రెండు కాళ్లను నాలుగు ముక్కలు, రెండు చేతులను నాలుగు ముక్కలు చేశారు. తల, మొండెం వేరు చేశారు. ఒక బస్తాలో కాళ్లు, చేతులు, తల లభించాయి. మొండాన్ని ప్లాస్టిక్‌ బ్యాగుల్లో పెట్టి ప్లాస్టర్‌తో ప్యాకింగ్‌ చేశారు. ఆపైన బస్తాలో వేసి మూట కట్టారు. ఘటనాస్థలి వద్ద మెరూన్‌ కుర్తా, రెడ్‌ కలర్‌ పైజామా, గాజులు, చేతి ఉంగరాలను క్లూస్‌టీమ్‌ సేకరించింది. డాగ్‌ స్క్వాడ్‌ ఘటనాస్థలి నుంచి ప్రధాన రహదారి వరకూ వెళ్లి ఆగిపోయింది. 

సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నాం: మాదాపూర్‌ ఏసీపీ
‘దొరికిన ఆధారాలను బట్టి ఆమె ఉత్తర భారతీయురాలని అనుమానిస్తున్నాం. రెండు, మూడు రోజుల క్రితమే చంపి ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉండొచ్చు. ముఖం గుర్తించ లేని స్థితిలో ఉంది. బొటానికల్‌ గార్డెన్‌ నుంచి శ్రీరాంనగర్‌ కాలనీ వైపు వచ్చే వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. నిందితులను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరిస్తున్నాం’అని మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌రావు తెలిపారు. ‘మృతురాలిని ఇష్టమొచ్చినట్టు కొట్టడంతో ఎముకలు విరిగిపోయాయి. చనిపోయిన తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేశారు. 8 నెలల మగశిశువు కూడా చనిపోయాడు’అని పోస్టుమార్టంలో తేలిందన్నారు

ఉద్యోగం కోసం వచ్చి శవమైంది.. 
హయత్‌నగర్‌లోని మిధానీ కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. నల్లగొండ జిల్లా కొండ భీమనపల్లి గిరిజానగర్‌ తండాకు చెందిన ఇనావత్‌ కోట్యా, రూప్లా దంపతుల కూతురు అనూష(23) రెండేళ్ల క్రితం బీటెక్‌ పూర్తి చేసింది. ఓ ఇన్సూరెన్స్‌ కంపెనీలో టెలీకాలర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న శంషాబాద్‌ వాసి మోతీలాల్‌తో నాలుగు నెలల క్రితం ఆమెకు వివాహం నిశ్చితార్థమైంది. అప్పటి నుంచి అనూషతో మోతీలాల్‌ సన్నిహితంగా ఉంటున్నాడు. హయత్‌నగర్‌లో ఉంటూ మేస్త్రీగా పనిచేస్తున్న అనూష బావ, అక్క సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లారు. ఈ నెల 25న ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం ఉందని, ఇంటర్వ్యూకు హాజరు కావాలని మోతీలాల్‌ అనూషను నగరానికి రప్పించాడు. హయత్‌నగర్‌లోని అక్క ఇంట్లో ఉంటున్న అనూష శనివారం ఇంటర్వ్యూకు వెళ్తానని శుక్రవారం తల్లికి ఫోన్‌ చేసింది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఫోన్‌ చేయకపోవడంతో అనూష అక్కాబావలు తమ ఇంటి పక్కనే ఉండే మేస్త్రీకి ఫోన్‌ చేశారు. అతను ఇంటికెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న అనూష కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. క్లూస్‌టీమ్‌ వచ్చి ఆధారాలను సేకరించింది. 

మోతీలాలే చంపేశాడు: అనూష తల్లి రూప్లా
‘పెళ్లికి రూ.8 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకున్నాం. నిశ్చితార్థంలో రూ.లక్ష ఇచ్చాం. ఈ పెళ్లి మోతీలాల్‌ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తర్వాత తెలిసింది. అయితే మోతీలాల్‌ అనూషను ఇష్టపడ్డాను.. పెళ్లి చేసుకుంటానని బలవంతం చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచాడు. మోతీలాల్‌ అన్న ఎస్సై కావడంతో అతని అండ చూసుకుని అనూషను చంపేశాడు’అని మృతురాలి తల్లి రూప్లా ఆరోపించారు. 

ముగ్గురిని నేనే చంపేశా- ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో నిందితుడు మధు
చందానగర్‌లో అపర్ణాదేవి, ఆమె తల్లి జయమ్మ, ఐదేళ్ల కుమార్తె కార్తికేయలను తానే చంపానని నిందితుడు ఆర్‌ మధు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తన భార్య యామినికి ఫోన్‌ చేసి వేధిస్తున్నందువల్లే ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డానని వెల్లడించారు. ఈ కేసు వివరాలను మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ మీడియాకు తెలియజేశారు. ‘పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఉర్లంపర్రు వాసి రావాడ మధు అదే గ్రామానికి చెందిన గూడూరు అపర్ణదేవి ప్రేమించుకున్నారు. 2004లో అమ్మ జయమ్మతో కలసి అపర్ణ నగరానికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మధు హైదరాబాద్‌ వచ్చి అపర్ణతో సహజీవనం చేశాడు. 2009లో కుటుంబ సభ్యుల బలవంతంతో యామినీని పెళ్లి చేసుకున్నాడు. 2011లో తిరిగి సిటీకి వచ్చిన మధు కేపీహెచ్‌బీలో నివాసముంటూ అదే ప్రాంతంలో మొబైల్‌ రిపేర్‌ షాపును నిర్వహిస్తున్నాడు. అపర్ణతోనూ సహజీవనం చేస్తుండటంతో 2013లో కార్తికేయ జన్మించింది. అప్పటికే యామినీకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే యామినీకి అపర్ణ, ఆమె తల్లి ఫోన్‌ చేసి తరచూ వేధిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఫోన్‌ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన మాటలను యామిని రికార్డు చేసి భర్తకు వినిపించింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అపర్ణ ఫ్లాట్‌కు వచ్చిన మధు విజయమ్మతో గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కార్తికేయను చంపేశాడు.

వారిని పడక గదిలో మంచంపై పడుకోబెట్టి.. టీవీ చూస్తూ కూర్చున్నాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఇంటికి వచ్చిన అపర్ణ తలపై కిచెన్‌లో వాడే రాయితో విచక్షణారహితంగా బాది హతమార్చాడు. సాయంత్రం 4 గంటలకు ఇంటికి తాళం వేసి కేపీహెచ్‌బీలోని తన ఇంటికి వెళ్లాడు. ఆదివారం జరిగిన విషయాన్ని భార్యకు తెలిపి బంధువుల ఇంటికి పంపాడు. ఆత్మహత్య చేసుకుందామని పటాన్‌చెరులోని ఓ లాడ్జ్‌లో రూమ్‌ తీసుకుని.. వెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించి కత్తితో మణికట్లపై కోసుకున్నాడు. సోమవారం ఉదయం మెలకువ రావడంతో మీడియాలో కథనాలు చూసి చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

మధు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా