మేము ఎవరికీ భారం కాకూడదు!

8 Feb, 2020 03:09 IST|Sakshi
మృతి చెందిన మమత, గౌతమి (ఫైల్‌)

ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు స్నేహితురాళ్లు

ఒకే ఫ్యాన్‌కు చీరతో ఉరి  వేసుకున్న యువతులు

తల్లిదండ్రులకు వేర్వేరుగా, కలసి సూసైడ్‌ నోట్‌లు

హయత్‌నగర్‌: ‘మాకు పెళ్లిళ్లు చేయడం వల్ల మీరు అప్పుల పాలు కాకూడదు. మా కారణంగా మీరు గొడవలు పడొద్దు. చావడం తప్పే.. మా చావు కారణంగా ఎన్నో పుకార్లు పుట్టుకొస్తాయి. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అయినా చావాలనుకుని చస్తున్నాం’అంటూ సూసైడ్‌ నోటు రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన బాషం నారాయణ, నారాయణమ్మ దంపతులు.. కుమార్తె గౌతమి(20)తో కలసి హయత్‌నగర్‌ డివిజన్‌లోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా పోత్నపల్లికి చెందిన రాములు, తిరుపతమ్మ దంపతులు.. కుమార్తె మమత(20)తో కలసి రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు గతంలో శ్రీనివాసకాలనీలో పక్కపక్కనే నివాసముండటం వల్ల గౌతమి, మమతల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇంటర్‌ వరకు చదివారు. మమత ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుండగా, గౌతమి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

శుక్రవారం మమత తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లగా, తమ్ముడు పాఠశాలకు వెళ్లాడు. గౌతమి మమత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో మమత తమ్ముడు ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఎవరికీ భారం కాకూడదని....
నా పెళ్లితో తమ్ముడి చదువు ఆగిపోకూడదంటూ మమత... నాన్నా నా చావుతో అయినా నీవు ప్రశాంతంగా ఉండు. అమ్మను బాధ పెట్టకు అని గౌతమి.. ఇరువురు వేర్వేరుగా సూసైడ్‌ నోట్‌ రాశారు. ‘మమ్మల్ని క్షమించండి. మా చావుకు ఎవరూ కారణం కాదు. మేము ఎవరికీ భారం కాకూడదు. మా పెళ్లిళ్ల కోసం మీరు అప్పులపాలు కావద్దు. మా ఆత్మహత్యకు అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. ఎలాంటి తప్పు చేయలేదు. మా చావుతో ఇరు కుటుంబాల వారు ఎలాంటి గొడవలకు దిగరాదు’అంటూ ఇద్దరు కలసి మరో సూసైడ్‌ నోటు రాశారు.

మరిన్ని వార్తలు