కేరళలో ఇద్దరు కాంగ్రెస్‌ నాయకుల హత్య

18 Feb, 2019 10:47 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని కాసరగోడ్‌ జిల్లాకు చెందిన ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు హత్యకు గురికావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. కాంగ్రెస్‌ నాయకులైన క్రిపేశ్‌, శరత్‌ లాల్‌ ఆదివారం బైక్‌పై వెళ్తుండగా.. కొందరు దుండగులు దాడి చేయడంతో వారు మృతి చెందారు. ఎస్‌యూవీ వాహనంలో వచ్చిన ఓ బృందం కాంగ్రెస్‌ నాయకుల బైక్‌ను ఆపి కొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు. క్రిపేశ్‌, శరత్‌లు తమ ఇంటికి దగ్గర్లోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. 

ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ హత్య వెనక సీపీఎం నాయకుల హస్తం ఉందని ఆరోపించింది. క్రిపేశ్‌, శరత్‌ల హత్యకు నిరసగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి(యూడీఎఫ్‌) తరఫున కేరళలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపింది. అంతేకాకుండా కాసరగోడ్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ నాయకుడు రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. రౌడీల ద్వారా కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయాలని సీపీఎం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలను సీపీఎం జిల్లా కార్యదర్శి ఎంవీ బాలకృష్ణన్‌ ఖండించారు. ఈ ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ హత్య రాజకీయాలకు వ్యతిరేకమని.. ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు. 

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది..
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు దారుణ హత్యకు గురికావడం బాధ కలిగించిందన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్యకు పాల్పడిన వారికి శిక్ష పడేవరకు పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. 

మరిన్ని వార్తలు