ఉద్యోగాల పేరుతో మోసం..

2 Aug, 2018 08:48 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్‌కడప): ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పెద్ద పెద్ద చదువులు చదివారు.. ఒక్కో ఇంట్లో ఇంజినీరింగ్‌ చదివిన వారు ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు.. 10, ఇంటర్‌ అర్హత కలిగిన ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్‌ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు.. ఉన్నత చదువులు చదివి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.. చిన్న ప్రైవేట్‌ ఉద్యోగమైనా దొరికితే చాలనుకునే ఇలాంటి నిరుద్యోగుల ఆశలను, అవకాశాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసుకొని ఉడాయిస్తున్నారు. నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు ఇటీవల జిల్లాలో అనేకం చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించిన యువకులు వారు మోసపోయామని గ్రహించడానికి నెలలు, ఏళ్లు పడుతోంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మోసగాళ్లపై కేసులు నమోదవుతున్నా ఫలితం లేదనే చెప్పాలి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
 
జిల్లాలో పలువురు నిరుద్యోగులు మోసపోయిన సంఘటనలు
∙కొండాపురం మండలంలో రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు నిరుద్యోగులను మోసం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద రూ.6 లక్షలు వసూలు చేసి వాళ్లిద్దరూ ఉడాయించారు. కొండాపురం, సింహాద్రిపురం మండలంలోని పలువురు యువకులు అతనికి డబ్బు ఇచ్చి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై కేసులు నమోదైనా బాధితులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదనే చెప్పాలి. ∙కొన్ని రోజుల క్రితం నందలూరులోని ఆల్విన్‌ ఫ్యాక్టరీ స్థలంలో సోలార్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని కడపకు చెందిన వ్యక్తి బాగా ప్రచారం చేశాడు.

ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు తన వద్ద ఉన్నాయని చెప్పి దరఖాస్తు ఫారం రూ.100గా నిర్ణయించాడు. ఈ ఫ్యాక్టరీలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పడంతో కడపతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన యువకులు నిరుద్యోగులు అతని వద్ద దరఖాస్తు ఫారాలు తీసుకొని వెళ్లారు. అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం లేదని, మోసపోయామని గ్రహించిన కొందరు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

∙కొన్ని నెలల క్రితం ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానికుల సాయంతో ప్రొద్దుటూరులో ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్, మస్కట్, ఖతార్‌ తదితర ప్రాంతాల్లోని కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బాగా ప్రచారం చేశారు. ఒక్కో వ్యక్తి వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు వసూలు చేసుకున్నారు. వారి పాస్‌పోర్టులను కూడా తీసుకొని రాత్రికి రాత్రే ఉడాయించారు. సుమారు 40 మందికి పైగా మోసపోయారు. బాధితులు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

∙తాజాగా ప్రొద్దుటూరులో సుమారు 150 మంది యువకులు ఉద్యోగాల కోసం డబ్బు ఇచ్చి మోసపోయారు. వీరు ఏడాది క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులకు రూ. 50 వేలు చొప్పున చెల్లించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ కంపెనీలో ప్యాకింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని, జీతం కూడా సుమారు రూ.1.20 లక్షలు దాకా ఉంటుందని చెప్పడంతో డబ్బు కట్టారు. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, వేంపల్లి, ఖాజీపేట, గోపవరంతో పాటు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు డబ్బు చెల్లించారు.

వీరిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్‌ చదివిన వారు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపిస్తారని ఐదు నెలల నుంచి అడుగుతున్నా వారు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల ముగ్గురి ఫోన్లు కూడా పని చేయకపోవడంతో టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరైన పాతకడప రెడ్డయ్య ఫిర్యాదు మేరకు శ్రీనివాసనగర్‌కు చెందిన హెచ్‌ఎం బాషా, నాగరాజు, నాగేంద్రకుమార్‌లపై చీటింగ్‌ కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు