టూరిస్టు వీసాలతో నిరుద్యోగుల తరలింపు

28 Nov, 2018 11:06 IST|Sakshi

మలేషియాలో ఉద్యోగాల పేరిట టోకరా

టూరిస్టు వీసాలతో నిజామాబాద్‌ వాసులను పంపేందుకు యత్నం

ఇమిగ్రేషన్‌ అధికారుల అప్రమత్తతతో బయటపడిన మోసం

విశాఖ పోలీసుల అదుపులో ముగ్గురు ఏజెంట్లు

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): మలేషియాలో ఉద్యోగాల పేరిట నిజామాబాద్‌ జిల్లావాసులను తీసుకెళ్తున్న తరుణంలో మోసం ముందుగానే బయటపడింది. ఇమిగ్రేషన్‌ అధికారుల అప్రమత్తతతో నిరుద్యోగులు బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. జరిగిన ఘోరాన్ని వారు అధికారులకు చెప్పడంతో ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి మంగళవారం రాత్రి 9.55 సమయంలో ఎయిరేషియా విమానం మలేషియాకు బయలుదేరాల్సి ఉంది. ఈ విమానం ఎక్కడానికి 17 మంది నిజామాబాద్‌ ప్రయాణికులు టూరిస్టు వీసాలతో సిద్ధమయ్యారు. వీరిని ఇమిగ్రేషన్‌ అధికారులు అనుమానించారు. ఇంత నిరుపేదల్లా ఉన్న మీరు టూరిస్టులా... ఎక్కడికెళ్లి ఎపుడొస్తారంటూ ప్రశ్నించడంతో వారు నిజం చెప్పేశారు. తాము టూరిస్టులం కాదని, ఉపాధి కోసం మలేషియా వెళ్తున్నామని చెప్పారు. అంతేకాదు.

తాము మలేషియాలో కూలి పనులకోసం రూ.50 వేల నుంచి రూ.70 వేలు వరకు చెల్లించామని చెప్పారు. దీంతో ఇమిగ్రేషన్‌ అధికారులు మలేషియాలో ఇలా జరిగే మోసాలను నిరుద్యోగులకు వివరించారు. విదేశీ వీసా లేకుండా టూరిస్టు వీసాలతో పంపుతున్నారంటే అక్కడ మోసానికి ప్లాన్‌ చేసినట్లేనని, ఇలాంటి ఉదంతాలు చాలా వెలుగు చూస్తున్నాయని చెప్పడంతో 17 మంది ప్రయాణికులూ కళ్లు తేలేశారు. ఇంత మోసమా...అంటూ వారిని సాగనంపడానికి వచ్చిన ఏజెంట్ల వైపు చూసే సరికి వారి నోట మాటలేదు. టెర్మినల్‌ బిల్డింగ్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులతోపాటు బయట ఉన్న మరో ఏజెంట్‌ని ఆ నిరుద్యోగులు పోలీసులకు చూపించారు. మోసపోకముందే మేల్కొలిపారని ఊపిరిపీల్చుకుని ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ముగ్గురు ఏజెంట్లను ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.

>
మరిన్ని వార్తలు