చిన్నారి మృతి.. క్షుద్ర పూజల కారణమా?

11 Jul, 2019 11:00 IST|Sakshi
చిన్నారి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని చిన్నారి మృతి

తెగిపడిన తల... ఒంటిపై దుస్తులు లేని వైనం   

గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలతో చంపేశారని అనుమానం

సాక్షి, జహీరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని సుమారు నాలుగు నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రేజింతల్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. హద్నూర్‌ ఎస్‌ఐ బాలస్వామి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం పశువులు మేపేందుకు వెళ్లిన పశువుల కాపరులు గ్రామ శివారులో గుట్ట సమీపంలో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని చూశారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ జేశారు. గ్రామ వీఆర్‌ఓ సంజీవ్‌ హద్నూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న ఎస్‌ఐ బాలస్వామి సంఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. 

మృతిపై పలు అనుమానాలు
నాలుగు నెలల చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు నెలల చిన్నారి శరీరంపై ఎలాంటి దుస్తులు లేకపోవడం, తల కూడా తెగిపోవం వల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుప్త నిధుల కోసం గుట్ట ప్రాంతంలో కొందరు క్షుద్ర పూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృత దేహం గుర్తు పట్టని విధంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కంట తడి పెట్టారు. చిన్నారి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు హద్నూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు