ఫోన్‌ చేసి వివరాలు పట్టి.. ఖాతాల్లో సొమ్ము కొల్లగొట్టి..

8 Nov, 2019 09:06 IST|Sakshi

పెనమలూరులో మోసపోయిన మహిళ 

సాక్షి, పెనమలూరు: మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే... తాడిగడప శ్రీనివాసానగర్‌ కాలువ కట్టకు చెందిన దోనేపూడి వరలక్ష్మి, ఆమె భర్త నాగరాజు ఉంటున్నారు. ఆమెకు విజయవాడ గురునానక్‌నగర్‌లో ఎస్‌బీఐలో ఖాతా ఉంది. అయితే బుధవారం ఉదయం ఆమెకు ఒక వ్యక్తి ఫోన్‌ చేసి, తాను ఎస్‌బీఐ ఆఫీసు నుంచి ఫోన్‌ చేస్తున్నానని, ఏటీఎం కార్డు కాలపరిమితి ముగిసిందని, రెన్యూవల్‌ చేయాలని నమ్మించాడు.

అతని మాటలు నమ్మిన ఆమె కార్డు వివరాలు తెలిపింది. ఇంతలో ఫోన్‌కు ఓటీపీ రాగా ఆ వివరాలు కూడా ఆమె ఫోన్‌ చేసిన వ్యక్తికి చెప్పింది. కొద్ది క్షణాల్లో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.74,800 సొమ్ము డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గుర్తించి ఆమె బ్యాంకు అధికారులకు తెలిపి ఏటీఎం కార్డు బ్లాక్‌  చేయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు సీఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు