హైస్కూల్లో దుండగుల బీభత్సం

24 Oct, 2018 06:39 IST|Sakshi
ధ్వంసమైన కారు

తెలుగు టీచర్‌ కారు ధ్వంసం

మాస్కులు కట్టుకుని వీరంగం

భీతిల్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): గోపాలపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నలుగురు దుండగులు తీవ్ర అలజడి రేపారు. రాడ్లు పట్టుకుని తిరుగుతూ సినీ ఫక్కీలో బీభత్సం సృష్టించారు. తెలుగు ఉపాధ్యాయుడు కారును ధ్వంసం చేశారు. వివరాలివి. ఇక్కడి హైస్కూల్లో సనపల ఉమాపతి తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన ఎప్పటిలాగే మంగళవారం పాఠశాలకు వచ్చి కారును పార్కింగ్‌లో పెట్టారు. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా, స్కూల్లోకి నలుగురు దుండగులు రాడ్లతో ప్రవేశించారు. కారు ముందు ఇద్దరు కాపు కాయగా, ఇద్దరు వ్యక్తులు రాడ్లతో కారు వెనుక అద్దాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వారు. ఉన్మాదంగా ప్రవర్తించి విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేసి పరారయ్యారు.

జరిగిన సంఘటనతో ఉమాపతి నిర్ఘాంతపోయారు. వెంటనే గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి రాడ్లు, రాళ్లతో వీరంగం చేశారని సంఘటనను గమనించిన వారంతా చెబుతున్నారు. ఉమాపతి కారునే అగంతకులు ఎందుకు టార్గెట్‌ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపట్నం మెయిన్‌రోడ్డులో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. మునుపెన్నడూ లేని సంఘటన ఇలా జరగడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొంత కాలంగా అపరిచితులు పాఠశాలలోకి ప్రవేశించి మద్యం, గంజాయి వంటి మత్తు మందులు సేవించడం, ప్రశ్నిస్తే తిరగబడుతుండడం చేస్తున్నట్లు అటెండరు వాపోయాడు. క్రీడా మైదానం, స్కూల్‌ పరిసరాల్లో పోలీసు నిఘా పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు