ఇంజినీరింగ్‌ కళాశాలలో దుండగుల అరాచకం

26 Feb, 2019 09:23 IST|Sakshi
కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థినులు

తూర్పుగోదావరి, రాజానగరం: తూర్పు గానుగూడెంలోని ఓ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలోని విద్యార్థినుల హాస్టల్‌లోకి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి, అరాచకం సృష్టించారు. దీనిపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రహరీపై ఇనుప ముళ్ల కంచె వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వాచ్‌మన్‌లను తొలగించి, కొత్తవారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. తమ డిమాండ్ల అమలుకు రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. లేకుంటే తిరిగి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విద్యార్థినులుండే హాస్టల్‌లోకి గుర్తు తెలియని ఇద్దరు యువకులు ప్రవేశించి, విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థిని బయటకు వచ్చి కేకలు వేయడం, ఇతర గదుల్లో ఉన్న విద్యార్థినులంతా బయటకురావడంతో దుండగులు పరారయ్యారు.

అయితే ఈ సంఘటనలో వాచ్‌మన్‌ తమను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ విద్యార్థినులు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు అక్కడకు చేరుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేయగా, చివరకు కళాశాల యాజమాన్యం తరఫున ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల హాస్టల్‌లోకి ఆదివారం రాత్రి ఒక దొంగ ప్రవేశించి, బెదిరించాడని, ఇతర విద్యార్థినులు రావడంతో పారిపోయాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినుల డిమాండ్‌ మేరకు ప్రహరీపై ఇనుప కంచె వేయడానికి, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్‌ ఏర్పాటు చేయడానికి, కొత్త వాచ్‌మన్‌లను నియమించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు