మద్యం తాగించి.. మట్టుబెట్టి..

19 Dec, 2018 12:31 IST|Sakshi
జంగారెడ్డిగూడెంలో వల్లెపు యర్రయ్య హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ

ఇటుక బట్టీ కూలీల మేస్త్రి హత్య

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

మరో ఇద్దరి కోసం గాలింపు

అడ్వాన్సు సొమ్ములు తిరిగి అడిగాడని ఘాతుకం

పశ్చిమగోదావరి , జంగారెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పట్టణానికి చెందిన వల్లెపు యర్రయ్య (45)ది హత్యే అని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ వెల్లడించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో యర్రయ్య హత్య కేసు వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. గతనెల 26న యర్రయ్య జంగారెడ్డిగూడెం నుంచి జల్లేరువాగు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 27న యర్రయ్య మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 28న ఉదయం మండలంలోని జల్లేరువాగులో యర్రయ్య శవమై కనిపించాడు. దీంతో ఎస్సై అల్లు దుర్గారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు, యర్రయ్య మృతదేహంపై గాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని యర్రయ్య హత్యకు గురైనట్టు నిర్ధారించి అనుమానాస్పద కేసును ఈనెల 16న హత్య కేసుగా మార్పు చేశారు.

పీక నొక్కి.. ఇసుకలోకి తొక్కి..
వల్లెపు యర్రయ్య ఇటుక బట్టీలో పనిచేసే కూలీలకు మేస్త్రిగా వ్యవహరిస్తుంటాడు. ఇటుక బట్టీల యజమానుల నుంచి అడ్వాన్సు తీసుకుని ఆ నగదును కూలీలకు బయానాగా ఇచ్చి వారితో పనిచేయిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నూజివీడులో ఇటుక బట్టీల యజమానుల నుంచి యర్రయ్య కొంత నగదును అడ్వాన్సుగా తీసుకున్నాడు. దీనిలో వేగవరంలో ఉంటున్న తెలంగాణలోని దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన మక్కెల శంకర్‌ అలియాస్‌ శ్రీను, ఉప్పలమెట్టలో నివసిస్తున్న దమ్మపేటకు చెందిన మొడియం వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకీ, బండి రాంబాబు, సోయం సురేష్, స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన తమ్మిశెట్టి అర్జున్‌ అనే ఐదుగురికి సుమారు రూ.4 లక్షలను అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ ఐదుగురు ఇటుక బట్టీ పనిలోకి వెళ్లకుండా తాత్సారం చేయడంతో యర్రయ్య వారిని నిలదీశాడు. అడ్వాన్సు సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో కక్ష గట్టిన ఐదుగురు యర్రయ్యను హతమార్చాలని పథకం పన్నారు. ఈ క్రమంలో గతనెల 26న సాయంత్రం యర్రయ్యను జల్లేరు వాగు సమీపంలోని బ్రాందీ షాపు వద్దకు రమ్మని పిలిచారు. అక్కడ యర్రయ్యతో వీరు అధిక మోతాదులో మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న యర్రయ్యను ఆటోలో కొంతదూరం తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి పీకనొక్కేశారు. దీంతో ఎర్రయ్య స్పృహ కోల్పోయాడు. తర్వాత యర్రయ్యను జల్లేరువాగులో పడవేసి కాళ్లతో తొక్కడంతో మృతిచెందాడు. ఈ సమయంలో వీరు ధరించిన దుస్తులకు రక్తం మరకలు కావడంతో వేగవరం వినాయకుడి గుడి వద్ద వాటిని కాల్చివేసినట్టు డీఎస్పీ పేర్కొన్నారు.

ఇద్దరు పరారీ
దర్యాప్తులో భాగంగా ఐదుగురు నిందితుల్లో మక్కెల శంకర్, మొడియం వెంకటేశ్వరరావు, తమ్మిశెట్టి అర్జున్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటకు వచ్చింది. దీంతో వీరిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచినట్టు డీఎస్పీ చెప్పారు. కేసులో మూడు, నాలుగు నిందితులుగా ఉన్న బండి రాంబాబు, సోయం సురేష్‌ పరారీలో ఉన్నారని, వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు. హత్య కేసును ఛేదించిన జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి సీఐ పి.రాజేష్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎ.దుర్గారావు, క్రైం పార్టీ హెచ్‌సీ ఎన్‌వీ సంపత్‌కుమార్, పీసీ డి.పోతురాజు, సర్కిల్‌ రైటర్‌ టి.ఎర్రయ్య, హెచ్‌సీ పరశురాం, పీసీలు కె.మధు, కె.సత్యనారాయణ, సీహెచ్‌ సత్యనారాయణలను డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు సిఫార్సు చేయనున్నట్టు డీఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.

మరిన్ని వార్తలు