ఓయూ లేడీస్‌ హాస్టల్‌లో ఆగంతకుడి హల్‌చల్‌

16 Aug, 2019 08:34 IST|Sakshi
తనిఖీలు చేస్తున్న క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌

విద్యార్థినులను కత్తితో బెదిరించి గదులకు బయటనుంచి గడియపెట్టిన వైనం..

పెనుగులాటలో విద్యార్థినికి గాయాలు  

తార్నాక: ఓయూ, ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థినుల హాస్టల్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి తీవ్ర కళకలం సృష్టించాడు. వాష్‌ రూమ్‌కువెళ్లిన యువతి గదిలోకి ప్రవేశించిన అతను అరిస్తే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థిని కేకలు విని విద్యార్థినులు బయటికి రావడంతో అతను గోడదూకి పారిపోయాడు.  ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ ఇంజినీరింగ్‌ లేడీస్‌ హాస్టలో ఉంటున్న ఓ విద్యార్థిని గురువారం తెల్లవారు జామున వాష్‌రూమ్‌కు  వెళ్లింది. అదే సమయంలో హాస్టల్‌  వెనుకవైపు నుంచి గోడదూకి వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె గదిలోకి ప్రవేశించి సెల్‌ఫోన్‌ తీసుకెళుతుండగా, గుర్తించిన ఆమె కేకలు వేసింది. దీంతో ఆ అగంతకుడు కత్తితో అరవొద్దంటూ ఆమెను బెదిరించడంతో ఆమె వాష్‌రూమ్‌లో దాక్కుని గడియవేసుకుంది.

దీనిని గుర్తించిన అతను బాత్‌రూంతో పాటు సమీపంలోని మూడు గదులకు బయటనుంచి గడియపెట్టాడు. అనంతరం వాష్‌ రూంలోకి వెళ్లిన అతను బాధితురాలిని కత్తితో  బెదిరిస్తూ బయటికి లాక్కొచ్చాడు. అతని భారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కేకలు  విద్యార్థినిలు బయటికి వచ్చి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను వారిని కత్తితో బెదిరిస్తూ గోడదూకి పారిపోయాడు. ఈ సమయంలో అతను చోరీ చేసిన సెల్‌ఫోన్‌ జారికింద పడిపోయింది.  సెల్‌ఫోన్‌ను దొంగిలించేందుకే అతను హాస్టల్‌లోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయనపడిన విద్యార్థినికి దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

క్లూస్‌ టీమ్,డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..
ఓయూ పోలీసులు డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. జాగిలాలు హాస్టల్‌ గోడ వెనుకవైపు వెళ్లి  ఆగిపోయాయి. బాధితురాలి కథనం మేరకు అగంతకుడు నల్లగా, పొట్టిగా ఉన్నాడని, తెలుగు, హిందీభాషలు మాట్లాడుతున్నట్లు తెలిసింది. వివరాల ఆధారంగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

హాస్టల్‌ను సందర్శించినఇన్‌చార్జ్‌ వీసీ
దీనిపై సమాచారం అందడంతో ఓయూ ఇన్‌చార్జ్‌ వీసీ అరవింద్‌కుమార్‌ గురువారం ఓయూ లేడీస్‌హాస్టల్‌ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

హాస్టల్‌లో సెల్‌ఫోన్ల గల్లంతు..
కాగా ఓయూ క్యాంపస్‌లోని పలు హాస్టళ్లలో అమ్మాయిల సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ముఖ్యంగా అగంతకుడు ప్రవేశించిన హాస్టల్‌లో ఇటీవల సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న విద్యార్థినులు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసినా వాటి ఆచూకీ లభించలేదు. 

మరిన్ని వార్తలు