అనంత’లో పట్టపగలు దారుణ హత్య

1 Dec, 2019 04:31 IST|Sakshi
హత్యకు గురైన జగ్గుల ప్రకాష్‌ (ఫైల్‌)

ఎమ్మార్పీఎస్‌ నేతను కత్తెరతో పొడిచి చంపిన దుండగుడు

దంపతుల మధ్య గొడవలో తలదూర్చడమే నేరం 

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

అనంతపురం సెంట్రల్‌: ‘అనంత’లో పట్టపగలు హత్య జరిగింది. శనివారం మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు జగ్గుల ప్రకాష్‌ (45)ను.. కత్తెరతో పొడిచి రమణ హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుక్కపట్నం మండలం రామసాగరం గ్రామానికి చెందిన రమణ.. అనంతపురంలోని ఓ దుకాణంలో టైలర్‌. అతనికి ఐదేళ్ల కిందట శింగనమల మండలం కల్లుమడికి చెందిన సరళతో వివాహమైంది. పెళ్లయిన ఏడాదికే దంపతుల మధ్య మనస్పర్థలొచ్చాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు.

కొన్నేళ్లుగా దంపతుల మధ్య పంచాయితీ నడుస్తోంది. కోర్టుకు కూడా వెళ్లారు. ఇటీవల ఈ విషయమై తమకు న్యాయం చేయాలని మహిళ కుటుంబ సభ్యులు ప్రకాష్‌ను కోరారు. దీంతో సదరు మహిళకు న్యాయం చేయాలనే భావనతో పెద్దమనిషిగా ఇద్దరినీ పిలిపించి ఇటీవల పంచాయితీ చేశారు. భార్యాభర్తలు సర్దుకుని కాపురం చేయాలని రమణ, సరళకు ప్రకాష్‌ సూచించారు. అయితే వారు ససేమిరా అన్నారు. దీంతో మహిళకు న్యాయం చేయాలనే తలంపుతో కొంత డబ్బు చెల్లించాలని, లేకుంటే కేసు నడుస్తుందని రమణకు తేల్చి చెప్పాడు. అయితే తన భార్య తప్పు చేస్తే తాను పరిహారం చెల్లించాలా.. అనుకుంటూ ప్రకాష్‌పై రమణ కక్ష పెంచుకున్నాడు. 

కాపుకాచి కత్తెరలతో పొడిచాడు
ప్రకాష్‌ రోజూ పల్లవి టవర్స్‌ సమీపంలోని ఓ టీస్టాల్‌ వద్దకు వస్తాడని తెలుసుకున్న రమణ.. శనివారం మధ్యాహ్నం టైలరింగ్‌ షాపులో కత్తెర తీసుకుని నేరుగా అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ప్రకాష్‌తో వాగ్వాదానికి దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తెరతో గుండెలపై పలుమార్లు పొడవడంతో అక్కడికక్కడే ప్రకాష్‌ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా