ఎవరీ అమ్మ?

28 Jun, 2018 13:56 IST|Sakshi

గోపాలపట్నం విశాఖ : మలి సంధ్యలో ఓ అమ్మ ఒంటరి అయింది. ఆమె ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. ఎవరి తీసుకొచ్చారో తెలియదు. గోపాలపట్నం పెట్రోల్‌ బంకు జంక్షన్‌ బస్‌షెల్టర్‌లో నాలుగు రోజులుగా దీనంగా పడి ఉంది. మతిస్థిమతం లేక ఆమెనే వచ్చేసింది.. లేక పిల్లలు తీసుకొచ్చి వదిలేశారా అనేది స్పష్టతలేదు. పిచ్చివాళ్లు ఆమె వద్దకు వచ్చి పోతున్నారు.

దీన్ని బట్టి ఆమె కూడా ఎవరో యాచకురాలో, మతిస్థిమితం లేని వృద్ధురాలెవరో అంతా అనుకున్నారు. కానీ బుధవారం రాత్రి సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ పీఎం పేట స్కూల్‌ మాస్టారు ఎస్‌.మాధవరావుతో పాటు తోపుడు బండ్ల వర్తకులు మురళీకృష్ణ, బి.జగదీశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కె.విద్యాసాగర్, టీకొట్టు నిర్వాహకురాలు షేక్‌రాము, మరో యువకుడు ఆర్‌.వినయ్, ఆటో డ్రైవర్‌ కె.నరేంద్ర ఆమెకు టిఫిన్‌ పెట్టి వివరాలు ఆరా తీశారు.

ఆమెలో ఏదో తెలియని ఆందోళన కనిపించింది. వివరాలు చెప్పలేకపోయింది. బ్యాగులో చీరలు, కాశీగంగ, రుద్రాక్షలు, ఆధార్‌ కార్డు ఉన్నాయి. ఆధార్‌ కార్డు బట్టి ఆమె పేరు సి.శకుంతలమ్మ, పుట్టిన తేదీ 1945, భర్త (లేట్‌) సుబ్బిశెట్టి, 22–317, చట్టప్పబావివీధి, గుంతకల్, అనంతపూర్, ఆధార్‌ నంబరు 779646202682 ఉంది. అలాగే కె.శాంతమూర్తి 9963703563 ఫోన్‌ నంబరుతో ఓ కాగితం ఉంది. ఈ ప్రకారం వీరు ఫోన్‌ చేస్తే తనకు తెలీదని అటునుంచి సమాధానం వచ్చింది.

మళ్లీ చేస్తే ఫోన్‌  నుంచి సమాధానం లేదు. దీంతో వీరు పెందుర్తి లయోలా వృద్ధాశ్రమం నిర్వాహకుడు దొడ్డి ప్రకాష్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. గోపాలపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చి తీసుకురావాలని ఆయన స్పందించడంతో సీఐ పైడియ్యకు వీరు సమాచారం చెప్పి తీసుకెళ్లారు. దొడ్డి ప్రకాష్‌ ఆమెను అక్కున చేర్చుకుని సపర్యలు ప్రారంభించారు. ఆమె బాగోగులు తాను చూస్తానని భరోసా ఇచ్చారు. వృద్ధురాలి పట్ల మానవత్వం చూపిన వీరిని అంతా అభినందించారు.  

మరిన్ని వార్తలు