తల్లిదండ్రుల ముందే ప్రాణాలు విడిచిన కొడుకు

6 Feb, 2020 08:20 IST|Sakshi

సాక్షి, హాలియా (నాగార్జునసాగర్‌) : గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హాలియా మున్సిపాలిటీ పరిధి హజారిగూడెం సేజి సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా పట్టణానికి చెందిన శిర్సనగండ్ల శ్రీనివాస్‌ స్కూల్‌ బస్సు డ్రైవర్‌గా ఇతడి భార్య ఇందిరమ్మ పాలవ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు శిర్సనగండ్ల రేవంత్‌కుమార్‌(23) పాల వ్యాపారంలో తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రోజువారీగా  తెల్లవారుజామున 4గంటల సమయంలో నాయుడుపాలెం గ్రామానికి పాలుపట్టడానికి రేవంత్‌కుమార్‌ బైక్‌పై బయల్దేరాడు. మార్గమధ్యలోని హజారిగూడెం గ్రామ సమీపంలో అప్పటికే మాటువేసిన దుండగులు రేవంత్‌కుమార్‌పై రాయితో దాడిచేశారు. దీంతో అతను బైక్‌పైనుంచి కిందపడగానే వారి Ðð వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో అతికిరాతకంగా దాడిచేసి పరారయ్యారు.

తల్లిదుండ్రుల కళ్లెదుటే..
తల్లిదండ్రుల కంటే  అర్ధగంట ముందు రేవంత్‌కుమార్‌ పాలు పట్టడానికి బయల్దేరాడు. కాసేపటికే అతడి తల్లిదండ్రులు కూడా పాలుపట్టడానికి ఆదారిగుండానే వెళ్తున్నారు. ఈ క్రమంలో తన కుమారిడి బైక్‌ కిందపడి ఉండటాన్ని చేసి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించారు. చుట్టు పక్కల వెతగ్గా రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని చూసి బోరున విలపించారు. అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా రేవంత్‌కుమార్‌ తల్లిదండ్రుల ముందే తుది శ్వాస విడిశాడు. తెల్లవారు జామున కావడంతో వాకింగ్‌కు వచ్చిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వీరరాఘవులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

గతంలో జరిగిన ఘర్షణలే కారణమా?
రేవంత్‌కుమార్‌ హజరిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన హరి, సత్యనారాయణలతో రేవంత్‌కుమార్‌కు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పాత గొడవలే హత్యకు కారణాలని పోలీసులు భావిస్తున్నారు. హరి, సత్యనారాయణలే తమ కుమారుడిని పొట్టన బెట్టుకున్నారని రేవంత్‌కుమార్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం హాలియాలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ 
హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల  కారణాలపై ఆరా తీశారు. డాగ్‌స్వా్కట్‌ బృందం వేలిముద్రలను సేకరించి మృతదేహంపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు