ఉన్నావ్‌: యువతిని పెళ్లి చేసుకుంటానని నిందితుడి ఒప్పందం

9 Dec, 2019 12:34 IST|Sakshi

లక్నో : ఉన్నావ్‌ అత్యాచారం, హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాధితురాలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాధితురాలిపై అత్యాచారం, పెట్రోల్‌ పోసి నిప్పంటిన నిందితుల్లో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శివం త్రివేది బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అంతేగాక ఇందుకు ఓ ఒప్పంద పత్రం కూడా రాసిచ్చాడు. ఇదంతా మహిళను అత్యాచారం చేయకముందే జరగడం గమనార్హం. బాధితురాలిని 2018 జనవరిలో వివాహం చేసుకుంటానని నిందితుడు ఒప్పందం కుదుర్చుకొని అనంతరం 2018 డిసెంబర్‌లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒప్పంద పత్రంలో ‘‘హిందూ సంప్రదాయాల ప్రకారం 15 జనవరి 2018న మేము ఒక ఆలయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే ఇద్దరం భార్య, భర్తలాగా కలిసే జీవిస్తున్నాం. భవిష్యత్తులో మా బంధానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్నాం’’  అని నిందితుడు శివం త్రివేది ఒప్పంద పత్రంలో సంతకం చేశాడు.

ఇక గత ఏడాది డిసెంబర్‌లో మహిళను అత్యాచారం చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరైన శివం త్రివేదిని పోలీసులు అరెస్టు చేయగా ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చిన నిందితుడు.. బాధితురాలిని కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఇందుకు యువతి ఒప్పుకోకపోవడంతో గురువారం ఉదయం బాధితురాలిపై దాడికి దిగి పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు.  90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అనంతరం పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా  ఉ‍న్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై అత్యాచార ఘటనలు జరగకుండా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు, ప్రజలు విమర్శిస్తున్నారు. తన కూతురు చావుకు కారణమైన దోషులను ఉరి తీయాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు