బీజేపీ ఎమ్మెల్యేకు పటుత్వ పరీక్ష..!

27 Apr, 2018 13:14 IST|Sakshi
కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం కోర్టు అనుమతి పొందడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సెంగార్‌కు కోర్టు విధించిన 12 రోజుల కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అతన్ని నేడు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు.

అయితే సెంగార్‌కు పటుత్వ పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ముందుగానే సీబీఐ అధికారులు కోర్టుకి దరఖాస్తు చేయనున్నారు. విచారణలో సెంగార్‌ ఒకే ప్రశ్నకు రకరకాల సమాధానాలు చెప్పడంతో సీబీఐ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో సెంగార్‌ సోదరులను అరెస్ట్‌ చేసినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆయనను అరెస్ట్‌ చేసేందుకు స్థానిక పోలీసులు సాహసించలేకపోయారు. సీఎం యోగి అదిత్యనాథ్‌ సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. చివరికి అలహాబాద్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ అధికారులు సెంగార్‌ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన సెంగార్‌, ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మరోవైపు తనపై ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని సెంగార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు