గుజరాత్‌లో అంటరానితనం

31 Aug, 2019 21:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా అంతరానితనం కొనసాగుతూనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో దళిత ఉపాధ్యాయుడి పట్ల వివక్ష చూపిన అమానవీయ ఘటన తాజాగా వెలుగు చూసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటకు వచ్చింది. సురేంద్ర నగర్‌ జిల్లాలోని పియావా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దళితుడైన తన పట్ల ప్రధానోపాధ్యాయుడు మాన్‌సంగ్‌ రాథోడ్‌ ప్రతిరోజు వివక్ష చూపించారని బాధితుడు కన్హయలాల్‌ బరైయా(46) ఆరోపించారు. తనను అంటరానివాడిలా చూసేవారని వాపోయారు.

‘పాఠశాలలో రెండు వేర్వేరు కుండల్లో మంచినీళ్లు పెట్టించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేను ఒక కుండలో నీళ్లు మాత్రమే తాగాలి. అగ్రకులాల వారైన మరో ముగ్గురు ఉపాధ్యాయులు మరో కుండలో నీళ్లు ఉంచారు. అగ్ర కులాల వారి కుండలో నీళ్లు తాగినందుకు జూలైలో 3న నాకు నోటీసులు ఇచ్చారు. విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు వేధింపులు భరించాన’ని కన్హయలాల్‌ తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయనకు సాయుధ పోలీసుతో రక్షణ ఏర్పాటు చేశారు. గుజరాత్‌లో అంటరానితనం కొనసాగుతోందనడానికి కన్హయలాల్‌ ఉదంతమే నిదర్శనమని వాద్గామ్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవాని అన్నారు. అంతరానితనాన్ని రూపుమాపడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు