హృతిక్‌ను కలవరిస్తోందని.. భార్యను హత్య చేశాడు

12 Nov, 2019 09:05 IST|Sakshi

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ పట్ల ఉన్న విపరీతమైన అభిమానం ఆమె హత్యకు దారి తీసింది. హీరోపై పిచ్చి అభిమానం భర్త చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యేలా చేసింది. సినీ హీరోపై భార్య చూపుతున్న ప్రేమను చూసి అసూయపడ్డ భర్త.. ఆమెను హత్య చేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు డోన్నె డోజోయ్. అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట దినేశ్వర్ బుదిహాట్తో వివాహమైంది. వారిది ప్రేమ వివాహంగా స్నేహితుల ద్వారా తెలిసింది. క్వీన్స్ లోని ఓజోన్ రోడ్లో ఉండే జెమిని అల్ట్రా లాంజ్లో బార్‌లో డోజోయ్ పనిచేస్తున్నారు. హృతిక్ రోషన్కు ఆమె వీరాభిమాని. ప్రతి రోజూ అతని గురించే కలవరిస్తుండేది. రాత్రి వేళలలో కూడా అతని సినిమాలను విపరీతంగా చూస్తుండేది. ఈ విషయం మీద భర్త దినేశ్వర్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. అయినప్పటికీ.. ఆమె హృతిక్ రోషన్ పై ఉన్న అభిమానాన్ని వదలుకోలేదు. పైగా మరింత పెరిగింది. హృతిక్ రోషన్ తో భర్తను పోల్చి చూసేది. అతనిలా ఉండాలని అంటూ ఉండేది. ఇది దినేశ్వర్‌కు అస్సలు నచ్చేది కాదు. తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు.

ఈ నేపథ్యంలో డోజోయ్‌ను పలుమార్లు చిత్రహింసలకు గురిచేశాడు. భర్త వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో భర్తను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతన్ని నాలుగు రోజుల పాటు జైలులో ఉంచారు. దీంతో ఆమెపై తీవ్రంగా కక్ష పెంచుకున్న దినేశ్వర్‌ ఓ అర్థరాత్రి ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హృతిక్‌పై అసూయతోనే ఆమెను హత్య చేశాడని  డోజోయ్‌ స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆమె చాలా అందంగా ఉండేదని, భార్య అంటే దినేశ్వర్‌కు చాలా ఇష్టం అని కూడా వారు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా