‘నా భార్య చావుకు పోలీసులే కారణం’

15 Jan, 2019 11:00 IST|Sakshi

లక్నో : తనపై అత్యాచారం చేసిన నిందితులను పోలీసులు నిర్దోషులుగా విడుదల చేయడంతో మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యూపీ గొండా జిల్లా కెర్నల్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన ఓ 35 ఏళ్ల మహిళపై అదే ప్రాంతానికి చెందిన శంకర్‌ దయాల్‌ శర్మ, అతని సోదరుడు అశోక్‌ కుమార్‌ గతేడాది ఆగస్టులో అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఊరుకోక వీడియో తీసి బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ వారు సరిగా విచారించకుండానే నిందితులను వదిలేశారు.

ఆగ్రహించిన బాధితురాలి భర్త తమకు న్యాయం చేయాలంటూ గతేడాది లక్నోలోని యూపీ విధాన్‌ భవన్ ముందు ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. దాంతో ఈ కేసును జిల్లా క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. వారు కూడా 15 రోజుల క్రితం నిందితులు శంకర్‌ దయాళ్‌ శర్మ, అశోక్‌ కుమార్‌లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేశారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేని సదరు మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.

ఈ విషయం గురించి ఆమె భర్త మాట్లాడుతూ.. ‘పోలీసులు ముందు నుంచి మా కేసు విషయంలో నిర్లక్ష్యంగానే ఉన్నారు. సరిగా విచారణ చేయలేదు. ఇక న్యాయం జరగదని భావించిన నా భార్య ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు పోలీసులు కారణమం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ బాధ్యులైన ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయడమే కాక తదుపరి విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు