యమపురికి ఈ రహదారులు

11 Sep, 2018 23:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య యేటా లక్షాయాభైవేల పైమాటే

2016లో అత్యధికంగా 1,50,785 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి... 

ప్రతియేటా మరో  5 నుంచి 7 లక్షల మంది క్షతగాత్రులు...

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 2016లో అత్యధికమంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించారు. ఇందులో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లోనే అత్యధిక మంది మృత్యువాత పడ్డారు. దేశంలో 2016లో మొత్తం 4,80,652 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 1,50,785 మంది మరణించారు. ఈ లెక్కన రోజుకి 1,317 యాక్సిడెంట్లు జరుగుతోంటే ఈ ప్రమాదాల్లో రోజుకి కనీసం 413 మంది మరణిస్తున్నారు.  మనదేశంలో గంటకి 55 యాక్సిడెంట్లు జరుగుతోంటే అందులో 17  మంది మరణిస్తున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి నూరు యాక్సిడెంట్లకీ మరణాల సంఖ్యను బట్టి చూస్తే 2015లో ప్రమాదాల తీవ్రత 29.1 గానూ, 2016లో 31.4 గానూ ఉంది. 

ఈ రిపోర్టు ప్రకారం జాతీయ రహదారుల్లో 34.5 శాతం ప్రమాదాలు సంభవిస్తుంటే, రాష్ట్ర రహదారుల్లో సైతం  27.9 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇతర రోడ్లల్లో జరుగుతున్న ప్రమాదాలే ఎక్కువగా నమోదౌతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులు మినహా మిగిలిన రోడ్లల్లో జరుగుతున్న ప్రమాదాలు 37.6 శాతం ఉన్నాయి. ఈ ప్రమాదాలన్నింటిలో అతి వేగమే ప్రధాన కారణంగా రిపోర్టు వెల్లడించింది. ఆ తరువాత మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అతివేగం కారణంగా జరుగుతున్నవి 66.5 శాతం. వీటిలో 61 శాతం మంది మరణిస్తున్నారు. మొబైల్‌ ఫోన్‌లు వాడటం వల్ల జరిగిన ప్రమాదాలు 5000 అయితే ఈ కారణంగా మరణించిన వారు 2000 మంది.

ప్రభుత్వ అంచనా ప్రకారం నగరాలకు సంబంధించి చెన్నై రోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. 2016లో 7,486 యాక్సిడెంట్లు ఒక్క చెన్నైలోనే జరిగాయి. దాని తరువాతి స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 2016లో 7,375 ప్రమాదాలు జరిగాయి. బెంగుళూరు, ఇండోర్, కలకత్తాలు ప్రమాదాల్లో మొదటి ఐదు స్థానాల్లో చెన్నై, ఢిల్లీల సరసన చేరాయి. రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 12.8 శాతం రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. తమిళనాడులో 11.4 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మహారాష్ట్రలో 8.6, కర్నాటకలో 7.4 శాతం రోడ్డు ప్రమాదాలు రికార్డయ్యాయి. 

2017లో 1.47 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇది మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ జనాభాతో సమానం. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2016తో పోల్చుకుంటే 2017లో రోడ్డు ప్రమాదాలు 3.27 శాతం తగ్గినా 2018 తొలి మూడు నెలల్లోనే 1.68 శాతం పెరగడం గమనార్హం . 

అత్యధిక మంది యువకులే...

 • 2016లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 60 (69,851 మంది) శాతం మంది 18–35 ఏళ్ళ లోపువారే. దాదాపు వీరంతా ఆయా కుటుంబాలను పోషిస్తున్న వారు. 
 • 35–45 ఏళ్ళ వయస్సు వారు –33,558 మంది.
 • 45–60 ఏళ్ళ మధ్య వయస్సు వారు 22,174 మంది.
 • 18 ఏళ్ల లోపు వయస్సు వారు 10,622 మంది.
 • 60 ఏళ్ళు పైబడిన వారు 8,814 మంది.
 • వయస్సు తెలియని వారు 5,766 మంది.

ఏఏ కారణాలతో ఎంతెంత మంది మరణించారు...

 • అతివేగం కారణంగా 73,896 మంది మరణించారు.
 • ఓవర్‌టేక్‌ చేయడం వల్ల 9,562 మంది మృతి చెందారు.
 • మద్యం సేవించి వాహనాలు నడిపేవారు 6,131 మంది మరణించారు.
 • రాంగ్‌సైడ్‌ లో వెళ్ళడం కారణంగా 5,705 మంది మరణించారు.
 • రెడ్‌ లైట్‌ సిగ్నల్‌ జంప్‌ చేసినందువల్ల 4,055.
 • డ్రైవర్ల తప్పిదం, లేదా డ్రైవర్ల అనారోగ్యం, ఫిట్‌నెస్‌ లేకపోవడం వల్ల 1,796 మంది మరణించారు.
 • హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 10,135 మంది.
 • సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం వల్ల 5,638 మంది మృత్యువాత పడ్డారు. 
Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా