హెచ్‌సీయూలో ఉత్తరాఖండ్‌ విద్యార్థి ఆత్మహత్య

9 Aug, 2018 06:16 IST|Sakshi
రజనీశ్‌ పర్మార్‌ (ఫైల్‌)

ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఉత్తరాఖండ్‌కు చెందిన రజనీశ్‌ పర్మార్‌(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలై 17న వర్సిటీలోని ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇంగ్లిష్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ తీసుకున్న రజనీశ్‌.. ఐ హాస్టల్‌లోని రూం నంబర్‌ 25లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆయన హాస్టల్‌లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో స్నేహితుడు మనోజ్‌ ఆ గదికి వెళ్లగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు రజనీశ్‌ వేలాడుతూ కనిపించాడు. వెంటనే మనోజ్‌ యూనివర్సిటీ అధికారులకు, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీశ్‌ రెండ్రోజుల క్రితమే తన అడ్మిషన్‌ రద్దు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. హాస్టల్‌ ఖాళీ చేస్తున్నట్టు వార్డెన్‌కు బుధవారం లేఖ కూడా రాసినట్టు వివరించారు. అడ్మిషన్‌ ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలియాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని సీఐ గంగాధర్‌ తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

నెగెటివ్‌ థాట్స్‌తోనే..
నెగెటివ్‌ థాట్స్‌తోనే రజనీశ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బెనారస్‌ యూనివర్సిటీలో అతడితో కలిసి చదువుకున్న మనోజ్‌ పోలీసులకు తెలిపారు. బెనారస్‌ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఓ నవల చదివేవాడని అప్పట్నుంచి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నాడని ఆయన తెలిపారు. వ్యతిరేక ఆలోచనలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు