స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..!

24 Jun, 2018 15:43 IST|Sakshi
పాఠశాల వద్ద ఉద్రిక్తత. ఇన్‌సెట్లో ఓ బ్యాగులో లభ్యమైన పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసా

వడోదర: గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు. పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని హత్య చేస్తే తన లక్ష్యం నెరవేరుతుందనుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 9వ తరగతి చదువుతున్న దేవ్‌ తాడ్వి(14)ని హత్య చేసి టాయ్‌లెట్‌లో పడేశాడు. వడోదర ఎస్పీ మనోజ్‌ శశిధర్‌ ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు..

నిందితుడు శ్రీ భారతీ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు.  ప్రవర్తన సరిగా లేనందున అతన్ని టీచర్లు పలుమార్లు మందలించారు. దాంతో అతడు పాఠశాలపై తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు. ఎవరినైనా హత్య చేస్తే స్కూలు మూతపడుతుందని భావించాడు. శుక్రవారం మధ్యాహ్నం టాయ్‌లెట్ల వద్దకు వచ్చిన దేవ్‌ తాడ్విపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. 90 సెకన్ల కాలంలోనే నిందితుడు తాడ్వి ప్రాణాలు తీశాడని ఎస్పీ తెలిపారు. మృతుడి శరీరంపై 31 కత్తిగాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించామని అన్నారు. స్కూలు పక్కనే ఉన్న దేవాలయం వద్ద లభించిన ఓ బ్యాగులో పదునైన ఆయుధాలు, కారం నీళ్లతో కూడిన సీసాను గుర్తించామన్నారు. 

హత్యానంతరం ఇల్లు విడిచి పారిపోయిన బాలున్ని మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, పాఠశాలను శాశ్వతంగా మూసేయాలని మృతుని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, నిందితుడి మానసిక స్థితి సరిగా లేనందున అతనిపై చర్యలకు అప్పుడే డిమాండ్‌ చేయలేమని గుజరాత్‌ మహిళా, శిశు సంక్షేమ బోర్డు చైర్మన్‌ జాగృతి పాండ్యా అన్నారు. ఇదే తరహా ఉదంతం గతేడాది హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పాఠశాలను మూసేయించాలనే పన్నాగంతో అక్కడే చదువుతున్న ఓ ఏడేళ్ల బాలున్ని గొంతుకోసి చంపేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా