భార్య ఓడిపోయిందని.. ఆమె భర్తను చంపేశాడు!

27 Mar, 2019 11:16 IST|Sakshi

న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల్లో తన భార్య ఓటమిని తట్టుకోలేని భర్త, గెలిచిన సర్పంచ్‌ అభ్యర్థి భర్తను చంపేసిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. హతుడు బాలాసాహెబ్‌ సోపాన్‌ వాన్షివ్, హత్యకు పాల్పడ్డ అవినాష్‌ కాంబ్లేలు దగ్గరి బంధువులు. ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి రాజకీయ విభేదాలు, భూవివదాలూ ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు ఈ మధ్యే అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంబ్లే భార్యపై వాన్షివ్‌ భార్య గెలుపొందారు. దీన్ని తట్టుకోలేని కాంబ్లే, వాన్షివ్‌ను కారుతో గుద్ది చంపాలని స్కెచ్‌  వేశాడు.

వాన్షివ్‌కు మార్నింగ్‌ వాక్‌ అలవాటు ఉండటంతో అతడు ఎప్పటిలాగే వాకింగ్‌ (మార్చి 13న)కు వెళ్లాడు. ఆ సమయంలో పథకం ప్రకారం.. కాంబ్లే కారులో తన సహచరులతో కలసి అక్కడికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని వాన్షివ్‌ గమనించేలోపే అతడ్ని ముందు నుంచి కారుతో ఢీకొట్టారు కాంబ్లే. అలా కొన్నిసార్లు కారుతో వాన్షివ్‌ను ఢీకొట్టిన.. కాంబ్లే, అతని సహచరులు అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలతో ఉన్న వాన్షివ్‌ను గుర్తించిన కొందరు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ కొన్ని రోజులకే అతడు మరణించాడు. 

హతుడు వాన్షివ్‌ భార్య, తన భర్తది సహజ మరణం కాదని.. కావాలనే ఎవరో పక్కా ప్లాన్‌తో చంపారని పోలీసలకు కంప్లైంట్‌ ఇచ్చింది.  పంచాయతీ ఎన్నికల్లో తన గెలుపును  సహించని కొందరు కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆమె  తన ఫిర్యాదులో తెలిపింది. దర్యాప్తు  ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ  ఆధారాలతో వాన్షివ్‌ది హత్యగా తేల్చారు.  కారుతో అతడిపై దాడికి తెగబడిన కొందరిలో ప్రధాన నిందితుడు కాంబ్లే కూడా సీసీటీవీతో దొరికిపోయాడు.  ఎన్నికల్లో గెలువడంతో తమకు ముప్పు పొంచి ఉందని వాన్షివ్‌ దంపతులు ముందే పోలీసులకు చెప్పారని, దాంతో ఆ ఎన్నికల్లో‍ పోటీ చేసిన కాంబ్లే తదితరులపై నిఘా వేసి.. తగిన ఆధారాలు దొరకడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు