కేసీఆర్, చంద్రబాబు, మోదీకి చేరేదాకా షేర్ చేయండి!

14 Nov, 2017 12:57 IST|Sakshi

సాక్షి, వెల్దండ (కల్వకుర్తి) : నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్ఐ తనను కొట్టాడన్న అవమానభారంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. 'భార్య వాళ్ల గ్రామస్తులు కొట్టారు. ఆపై బట్టలిప్పి చచ్చేలా పోలీసులు నన్ను కొట్టారు. నా మృతికి ఎస్ఐ సైదాబాబు కారణం. కేసీఆర్, చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీకి చేరేంత వరకూ ఈ వీడియోను షేర్ చేయాలంటూ' బాధితుడు రాజు తీసుకున్న సెల్ఫీ వీడియోను పలువురు నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీంతో విషయం వెలుగుచూసింది.

అసలేమైందంటే..
వెల్దండ మండల పరిధిలోని నారాయణపూర్ తాండకు చెందిన పాత్లవత్ రాజు (25)కు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టిఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొరింతకుంట తండాకు చెందిన అంజలితో రాజుకు ఐదేళ్ల కిందట వివాహమైంది. వీరికి గతంలో ఓ కుమారుడు ఉండగా, వారం కిందట అంజలి ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచీ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 12న తలకొండపల్లి పోలీస్‌స్టేషన్లో అంజలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేయగా.. భర్త రాజును పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అయితే కౌన్సెలింగ్ పేరుతో పోలీసులు వేధించడంతో మనస్తాపానికి లోనైన రాజు తన తండాకు వచ్చి పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కలవాళ్లు రాజు పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. చికిత్స పొందుతూనే రాజు సోమవారం మృతిచెందగా.. ఎస్ఐ కొట్టడంతో అవమానభారంతో రాజు బలవన్మరణం చెందాడని తండా వాసులు చెబుతున్నారు.

చేయి చేసుకోలేదు: ఎస్ఐ
రాజు మద్యం మత్తులో భార్య అంజలిపైనే కాకుండా కుటుంబసభ్యులు, తండావాసులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తండావాసులే రాజుపై చేయి చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆరోజు రాత్రి ఇంటికివెళ్లి మరునాడు ఉదయం భార్యాభర్తలు స్టేషన్‌కు రాగా, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాం. అంతేతప్ప నేను కానీ, పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది కానీ రాజుపై చేయి చేసుకోలేదని ఎస్ఐ సైదాబాబు తెలిపారు.

ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

మరిన్ని వార్తలు