వీడని మిస్టరీ

4 Oct, 2019 13:29 IST|Sakshi
మృతుడిని పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్‌)

రెండు నెలలు గడుస్తున్నా వెంకటేశ్వర్లు మృతి కేసులో కానరాని పురోగతి

హత్యకు గురయ్యారని మృతుడి భార్య, బంధువుల ఆరోపణ

జమ్మలమడుగు: మైలవరం మండలం పొన్నంపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు మృతి మిస్టరీ వీడలేదు. దాదాపు 45 రోజులు అవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదు. హత్య, ఆత్మహత్య అన్న సందేహాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతుడు వెంకటేశ్వర్లు భార్య సుజాత తన భర్త పనిచేస్తున్న గని యజమాని పైనే తమకు అనుమానం ఉందంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

అసలేం జరిగింది?!
మృతుడు వెంకటేశ్వర్లు పెన్నానది బ్రిడ్జి కింద మృతిచెంది ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు బ్రిడ్జిపై నుంచి కింద పడి ఉంటే శరీరంపై గాయాలయ్యేవి. పైగా మృతుడు మరణించినప్పుడు తలకింద రాయి ఉంది. దీనిని బట్టి తానే దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటే కచ్చితంగా తలకు బలమైన గాయాలు తగిలి రక్తస్రావం జరిగేది. ముందుగానే హతమార్చి అందరికీ అనుమానం వచ్చేలా తలకింద రాయిపెట్టి పడుకోబెట్టిన విధంగా ఉంది. అయితే శరీరంపై ఎక్కడ కూడా చిన్న గాయం కూడా కాలేదు. అయితే పోస్టుమా ర్టం రిపోర్టులో శరీరంలో ఎముకలపై గాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

సంబంధం లేదన్న యజమాని  
కార్మికుకడు వెంకటేశ్వర్లు మృతికి తాను కారణం కాదంటూ పెన్నానదిలో గని నిర్వహిస్తున్న ప్రొద్దుటూరు కాకిరేని పల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి విచారణలో తెలిపారు. తన వద్ద డబ్బులు తీసుకుని పనికి సక్రమంగా రాకపోవడంతో తాను మందలించిన మాట వాస్తవమే అన్నారు. అయితే వెంకటేశ్వర్లును హతమార్చేంత కక్ష తనకు లేదన్నారు. తాను ఇంటి వద్ద నుంచి స్కూటర్‌లో తీసుకుని వచ్చినమాట నిజమే అని, కానీ వెంకటేశ్వర్లు మృతికి తనకు సంబంధం లేదని విచారణలో వాపోయారు. నేరం చేయలేదంటూ గట్టిగా వాదించినట్లు తెలిసింది. 

కార్మికులను విచారించిన పోలీసులు
గనిలో పనిచేస్తున్న తోటి కార్మికులను విచారించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. సుమారు పదిరోజుల పాటు గని కార్మికులను పోలీసు స్టేషన్‌ చుట్టూ తిప్పుకున్నారు. ఎమైనా సమాచారం వస్తుందని ఆశించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. 

ఫోరెన్సిక్‌ రిపోర్టు వస్తే..
వెంకటేశ్వర్లుది హత్య, ఆత్మహత్య అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారణ చేశాం. ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఫోరెన్సిక్‌ రిపోర్టు త్వరలో వస్తుంది. దానిని బట్టి చర్యలు తీసుకుంటాం. హత్యకు గురై ఉంటే నిందితులను అరెస్టు చేసి, శిక్ష పడేలా చేస్తాం.  – రంగారావు, ఎస్‌ఐ, జమ్మలమడుగు .

మరిన్ని వార్తలు