కమ్యూనిస్టు నేత శివరామిరెడ్డి కన్నుమూత

11 Jan, 2019 09:22 IST|Sakshi
నర్రెడ్డి శివరామిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గురువారం శివరామిరెడ్డి బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు ఆస్పత్రి వైద్యులు డా.గురుప్రసాద్‌ మీడియాకు తెలిపారు. గతవారం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శివరామిరెడ్డికి గుండె సంబంధిత ఆపరేషన్‌ జరిగింది.

తొలితరం ప్రజాప్రతినిధి.. 
వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మరిన్ని వార్తలు