అప్పు చెల్లించలేదని ఆలిని తీసుకెళ్లాడు

24 Jul, 2018 01:21 IST|Sakshi
కొడుకుతో హన్మంతు

2 నెలలుగా వ్యాపారి చెరలోనే..

ప్రజావాణిలో జేసీకి బాధితుడి ఫిర్యాదు

మంచిర్యాలసిటీ: అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారి రుణగ్రహీత భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి దాచిపెట్టాడు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుడు జాయింట్‌ కలెక్టర్‌ సురేందర్‌రావుకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. నెన్నెల మండలం ఆవ డం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు, సరోజ దంపతులకు, రుషిత్‌ (3), ఐసు(1) సంతానం. అదే మండలం చిత్తాపూర్‌కు చెందిన రైస్‌మిల్లు వ్యాపారి సందాని వద్ద రెండేళ్ల కిందట రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి అసలుతో పాటు వడ్డీ చెల్లించలేదు.

ఈ క్రమంలో హన్మంతు రెండు నెలల కిందట తన కాపురాన్ని ఆవడం నుంచి మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్‌నగర్‌కు మార్చాడు. విషయం తెలుసుకున్న సందాని.. హన్మంతు భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి ఓ ఇంట్లో దాచి పెట్టాడు. నెల క్రితం హన్మంతు తర్వాత భార్యా పిల్లలు ఉంటున్న ఇంటి అడ్రస్‌ తెలుసుకొని వెళ్లడంతో సందాని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆదివారం మరోసారి వెళ్లానని, కొడుకు నాన్నా అంటూ నా వెంట రావడంతో తీసుకొచ్చానని తెలిపాడు. ‘అప్పు తీర్చితేనే నీ భార్యా పిల్లలు నీ వెంట వస్తారు.. లేకుంటే చంపేస్తా’ అని బెదిరించడంతో నెన్నెల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.

ఇది సివిల్‌ కేసు, కోర్టుకు వెళ్లమని ఎస్‌ఐ చెప్పడంతో గత్యంతరం లేక జేసీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని రోదిస్తూ విలేకరులకు చెప్పాడు. వడ్డీ సహా అప్పు తీర్చుతానని ఎంత ప్రాథేయపడినా వ్యాపారి కనికరించడం లేదని వాపోయాడు. 

మరిన్ని వార్తలు