ఆ మృగాళ్లకు ఉరే సరి

15 Apr, 2018 03:38 IST|Sakshi
శ్రీనగర్‌లో విద్యార్థినుల ఆందోళన దృశ్యం

‘కఠువా’ బాధితురాలి తల్లి డిమాండ్‌

ఉధంపూర్‌: తన బిడ్డను పొట్టనపెట్టుకున్న మృగాళ్లకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు కఠువా హత్యాచార బాధితురాలి తల్లి చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించనక్కర్లేదని, క్రైం బ్రాంచ్‌ విచారణపై పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ‘నా బిడ్డ చాలా తెలివైనది. పెద్దయ్యాక తనను డాక్టర్‌ను చేయాలనుకున్నాం. మరే కుటుంబం ఇలాంటి వేదనకు గురికాకుండా ఉండాలంటే దోషులకు ఉరి వేయడమే సరైన నిర్ణయం’ అని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేశారు. ఇంతకు ముందు హిందువులతో తమకు సన్నిహిత సంబంధాలుండేవని, కానీ ఇప్పుడు అవి దెబ్బతిన్నాయని, తాము భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపింది. హిందూ ముస్లింలకు తేడా తెలియని తన కూతురుని అత్యంత కిరాతకంగా చంపేసిన సంగతి ఈ లోకానికంతా తెలుసని ఆమె కన్న తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు, ఈ కేసును విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుచేయాలని కశ్మీర్‌ సీఎం మెహబూబా ఆరాష్ట్ర హైకోర్టు సీజేకి లేఖ రాశారు.

వైదొలగిన ఇద్దరు బీజేపీ మంత్రులు..
కఠువా రేప్, హత్య ఉదంతంలో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులను రాష్ట్రకేబినెట్‌ నుంచి తొలగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ శ్రీనగర్‌లో నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌శర్మ రాజీనామా లేఖలను సీఎంకు పంపారు. వాటిని గవర్నర్‌ ఆమోదించాల్సి ఉంది. రాజీనామా చేసిన వారిలో అటవీ శాఖ మంత్రి లాల్‌సింగ్, పరిశ్రమల మంత్రి చందర్‌ ప్రకాశ్‌ గంగా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు