మళ్లీ ఐటీ కేసు!

6 Apr, 2018 10:56 IST|Sakshi
శశికళ

పదేళ్లకు విచారణకు

చిన్నమ్మ మెడకు బిగిసేనా

అన్నాడీఎంకే అమ్మ దివంగత జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మీదున్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1991–96 కాలంలో మూటగట్టుకున్న అవినీతి చిట్టా ఆ తదుపరి ఒక్కొక్కటిగా బయట పడుతూ వచ్చింది. చివరకు అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చెన్నై ఎగ్మూర్‌ కోర్టులో విదేశీ మారక ద్రవ్యం కేసువిచారణ శరవేగంగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడో తుంగలో తొక్కిన కేసు ఫైల్‌కు మళ్లీ అధికారులు బూజు దులిపి విచారణకు తీసుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చిన్నమ్మ ప్రతినిధిదినకరన్‌ను ఓ వైపు పాత కేసుల రూపంలో  ఇరకాటంలో పెట్టే విధంగా పాలకులు పావులు కదుపుతూ వస్తున్నారు. తాజాగా అదే దృష్టి చిన్నమ్మ మీదున్న పాత కేసుల్ని తవ్వే పనిలో పడ్డట్టుగా చర్చ ఊపందుకుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా పదేళ్లక్రితం తుంగలో తొక్కిన ఐటీ కేసు మళ్లీ తెర మీదకు రావడంగమనించ దగ్గ విషయం.

సాక్షి, చెన్నై : చిన్నమ్మ మెడకు ఐటీ కేసు బిగిసేనా అన్న చర్చ బయలు దేరింది. తుంగలో తొక్కిన ఈకేసు ఫైల్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ వర్గాలు దుమ్ముదుళిపే పనిలో పడ్డాయి. శశికళ మీద గతంలో దాఖలైన ఐటీ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ బయటకు తీశారు. విచారణ వేగం పెంచే పనిలో కోర్టు నిమగ్నం అయింది. 1991–96కాలంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ శశికళ ఆగడాలకు హద్దే లేదని చెప్పవచ్చు. ఇందులో భాగంగా 1994–95లో ఐటీ రిటర్న్‌ దాఖలులోనూ తన పనితనాన్ని ఆమె ప్రయోగించారు. అధికారం దూరం అయ్యాక 1997లో డీఎంకే సర్కారు ఈ గుట్టును రట్టుచేస్తూ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్న కేసులకు తోడు మరో కేసుగా ఐటీ ఉచ్చు చిన్నమ్మ మెడకు  బిగించింది. శిక్ష సైతం పడిందనుకున్నప్పుడు అప్పీలు వెళ్లి తప్పించుకోగలిగారు. ఐటీ అధికారుల లెక్కల్లో తేడాలు ఉన్నట్టు, ఆస్తుల పునః లెక్కింపు జరగాల్సిందేనన్న శశికళ విజ్ఞప్తికి కోర్టు స్పందించింది.

శిక్ష నుంచి గట్టెక్కినా, లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తిచేసి మళ్లీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే సర్కారు మళ్లీ అధికారంలోకి రావడంతో కేసు కాస్త తుంగలో తొక్కినట్టుగా పరిస్థితి మారింది. ఆ తదుపరి డీఎంకే సర్కారు అధికారంలోకి రాగానే ఐటీ కేసు మళ్లీ తెర మీదకు వచ్చింది. చివరకు వాయిదా పడ్డ ఈ కేసును పదేళ్ల అనంతరం మళ్లీ దుమ్ము దులుపుతూ అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. మద్రాసు హైకోర్టులో గురువారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు పీఎస్‌ శివజ్ఞానం, శేషసాయి నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు విచారణకు రాగా, ఐటీ తరఫు న్యాయవాదులు శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. అలాగే, శశికళ తరఫున న్యాయవాది జోక్యం చేసుకుని  కేసు పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందని, అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు సమయం కేటాయించాలని కోరారు. ఇందుకు ఐటీ తరఫున సైతం అంగీకారం లభించడంతో న్యాయమూర్తులు స్పందించారు. తదుపరి విచారణ జూన్‌ ఆరో తేదీకి వాయిదా వేశారు. విచారణ వేగం పెంచి, కేసును త్వరితగతిన ముగించే రీతిలో కోర్టు చర్యలు చేపట్టి ఉండడంతో, చిన్నమ్మ మెడకు ఐటీ ఉచ్చు బిగిసేనా అన్న ప్రశ్న బయలుదేరింది.

మరిన్ని వార్తలు