కాలం చెల్లిన సరకులకు కొత్త ప్యాకింగ్‌

28 Apr, 2018 13:25 IST|Sakshi
శివాజీపాలెం వెంకటేశ్వర ట్రేడర్‌లో సోదాలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

విజిలెన్స్‌ దాడుల్లో గుట్టురట్టు

మర్రిపాలెం(విశాఖ ఉత్తర): కాలం చెల్లిన సరకులను కొత్తగా ప్యాకింగ్‌ చేసి సంక్షేమ శాఖ వసతి గృహాలకు సరఫరా చేస్తున్న కల్తీరాయుళ్ల గుట్టు విజిలెన్స్‌ దాడుల్లో బట్టబయలైంది. మాధవధార ప్రాంతంలో సూర్యకుమారి ఏజెన్సీస్‌ పేరుతో సరకులను గోదాంలో నిల్వ ఉంచారు. ఇక్కడ కాలం చెల్లిన ఉత్పత్తులు నిల్వలుగా ఉన్నట్టు విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఏజెన్సీకి చెందిన మాధవధార, శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలలో శుక్రవారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేశారు. గోధుమ పిండి ప్యాకెట్లు, డెయిరీ ఉత్పత్తులు, ఎనర్జీ డ్రింక్స్‌ను కాలం చెల్లినవిగా గుర్తించారు. ఏజెన్సీ నిర్వాహకుడు ప్రభాకర్‌ నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన ఎస్పీ కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

ఆహార పదార్థాలు కాలం చెల్లిన తర్వాత వాటిని వినియోగంలోకి లేకుండా దహనం చేయాల్సి ఉంది. అయితే వాటిని ఓ ముఠా తిరిగి ప్యాకింగ్‌ చేసి ఎం.ప్రెష్‌ బ్రాండ్‌తో నాణ్యత లేని సరుకును  మార్కెట్‌లో అమ్మకాలకు సిద్ధం చేస్తోంది. మాధవధారలోని సూర్యకుమారి ఏజెన్సీలో ఈ సరకు నిల్వ ఉందని విజిలెన్స్‌ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో శుక్రవారం అధికారులు దాడులు నిర్వహించారు. సరకు ఎక్కడెక్కడికి పంపించారో ఎస్పీ కోటేశ్వరరావు, బృంద సభ్యులు ఆరా తీసి.. శివాజీపాలెం, మధురవాడ ప్రాంతాల్లోని గోదాంలపై దాడులు చేశారు. శివాజీపాలెంలో వెంకటేశ్వర ట్రేడర్‌లో ఎం.ఫ్రెష్‌ పేరిట 60 బస్తాల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ట్రేడర్‌ యజమానులు మాట్లాడుతూ సూర్యకుమారి ఏజెన్సీ నుంచి సరకులు తీసుకుంటున్నామని అధికారులకు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలకు, ఆధ్యాత్మిక సంస్థలకు సరకు పంపిణీ చేసేందుకు సూర్యకుమారి ఏజన్సీ కాంట్రాక్ట్‌ తీసుకుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో  ఉన్నారు. ప్రజలకు నాణ్యత లేని సరకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్‌ డీఎస్పీ సి.ఎం.నాయుడు, సీఐ మల్లికార్జునరావు, కమర్షియల్‌ టాక్స్‌ అధికారి రేవతి, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు