కూల్‌ డ్రింక్స్‌ కేంద్రంపై విజిలెన్స్‌ దాడులు

5 Jun, 2018 12:51 IST|Sakshi
తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

డ్రింక్స్‌ తయారీలో నాణ్యత

పాటించలేనట్లు గుర్తించిన అధికారులు

నిల్వ ఉండేందుకు ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు నిర్థారణ

నిర్వాహకులపై కేసు నమోదు

కంచరపాలెం(విశాఖ ఉత్తర): జీవీఎంసీ 36వ వార్డు కంచరపాలెం పరిధి గోకుల్‌నగర్‌లో నిర్వహిస్తున్న వనజాక్షి శీతల పానీయాల తయారీ కేంద్రంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ డి.కోటేశ్వరరావు మాట్లాడుతూ వనజాక్షి కూల్‌ పాయింట్‌ నిర్వాహకులు డ్రింక్స్‌ తయారీలో నాణ్యత పాటించడం లేదన్న సమాచారం మేరకు జీవీఎంసీ ఆహార భద్రత అధికారులతో కలిసి దాడులు చేశామన్నారు.

ఈ దాడుల్లో కూల్‌ డ్రింక్స్‌ తయారీలో నాణ్యత పాటించనట్లుగా గుర్తించామని తెలిపారు. వాస్తవానికి కూల్‌ డ్రింక్స్‌ తయారీలో శుద్ధి చేసిన మంచినీరు వినియోగించాల్సి ఉన్నప్పటికీ నేరుగా బోరు నీటిని వినియోగించి అందులో హాని కలిగించే మ్యాంగో, గ్రేప్స్, సాల్ట్‌ ప్లేవర్స్‌తో పాటుగా ఎసెన్స్, కూల్‌డ్రింక్స్‌ ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రిజవేట్యు అనే రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించామన్నారు. శీతల పానీయాలు తయారీ కేంద్రంలో సేకరించిన శ్యాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీకి పంపించి నివేదిక అధారంగా చర్యలు చేపడతామన్నారు. కూల్‌ పాయింట్‌ నిర్వాహకుడు కె.ఈశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ సీఎం.నాయుడు, ఎస్‌ఐ రమేష్, డీసీటీవోలు రేవతి, మోహన్‌రావు, జీవీఎంసీ ఆహార భద్రత అధికారులు కోటేశ్వరరావు, జనార్థన్, జి.వి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు