నకిలీ ఇంజిన్‌ ఆయిల్‌ గుట్టు రట్టు

9 Jun, 2018 08:56 IST|Sakshi
నకిలీ ఆయిల్‌ను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎస్పీ రామాంజనేయులు

తాడిపత్రి, బీకేఎస్, అనంతపురంలో ఏకకాలంలో విజిలెన్స్‌ దాడులు

రూ.60 లక్షల ఆయిల్‌ స్వాధీనం

అంనంతపురం సెంట్రల్‌: వాహనాలకు వినియోగించే 2టి ఆయిల్‌ నకిలీ రాకెట్‌ ముఠా గుట్టును విజిలెన్స్‌ అధికారులు రట్టు చేశారు. తాడిపత్రిలో చెన్నంపల్లిరోడ్డులో శ్రీసాయిబాబా ఎంటర్‌ప్రైజెస్, బుక్కరాయసముద్రం మండలంలో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్, అనంతపురంలో ఎంజీ పెట్రోల్‌ బంకు వద్ద రమేష్‌ ఆయిల్‌ ట్రేడర్స్, శ్రీనివాసనగర్‌లో శ్రీసాయిభార్గవ లూబ్రికెంట్స్‌ మ్యానుఫ్యాక్చర్‌ షాపులపై విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు. విజిలెన్స్‌ ఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు బృందా లుగా ఏర్పడి ఈ దాడులు జరిపారు. విజిలెన్స్‌ అధికారుల కథనం మేరకు...

తాడిపత్రి పట్టణానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తాడిపత్రితోపాటు ఇతర ప్రాంతాల్లో కార్లు, లారీలు, ఇతర మెకానిక్‌ షెడ్డుల నుంచి పనికిరాని(వేస్ట్‌) ఆయిల్‌ను సేకరించి తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లిలో నిల్వ చేస్తున్నాడు. ఇలా నిలువ చేసిన వేస్ట్‌ ఆయిల్‌లోకి అర్త్‌ పౌడర్‌ కలిపి బాగా వేడి చేస్తారు. ఆ తర్వాత వేస్ట్‌ ఆయిల్‌లోని మడ్డి అంతా వేరైపోతుంది. తర్వాత మూడుసార్లు ఫిల్టర్‌ చేస్తే రీప్రాసెస్‌ ఆయిల్‌గా బయటకు వస్తుంది. ఇలా వచ్చిన ఆయిల్‌ను డ్రమ్ములలో నిల్వ ఉంచి రంగు కలిపి కొత్త ఇంజన్‌ ఆయిల్‌గా మార్చుతున్నాడు. ఇలా చేసిన ఆయిల్‌ను 20ఎంఎల్, 50ఎంఎల్, లీటరు, 5 లీటర్లు, 10లీటర్లు క్యాన్లలో కొత్తగా ప్యాక్‌ చేసి అనంతపురం, కడప, హిందూపురం, చీమకుర్తి, మదనపల్లి, పత్తికొండ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకు న్న విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి నిందితులను పట్టుకున్నారు. సదరు ఆయిల్‌ నకిలీదని గుర్తించారు. మొత్తం రూ.60 లక్షలు విలువ చేసే సరుకు, సామగ్రిని జప్తు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి, బుక్కరాయసముద్రం లక్ష్మినారాయణ, నగరంలో రమేష్‌ ఆయిల్‌ ట్రేడర్స్‌ నిర్వాహకులు రమేష్, శ్రీనివాసనగర్‌కు చెందిన మంజునాథ అనే షాపుల యజమానులపై  చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాని సిఫారసు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా