తిరుమలలో మందుబాబు హల్‌చల్‌

10 Jan, 2018 01:30 IST|Sakshi

కల్వర్టులో కూర్చుని మందు కొడుతున్నా పట్టని వైనం

సాక్షి, తిరుమల: నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయ మాడ వీధుల్లో మంగళవారం అపవిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరమాడ వీధిలోని ఆదివరాహస్వామి ఆలయం సమీపంలో తమిళనాడుకు చెందిన మణి (35) అనే వ్యక్తి మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. విజిలెన్స్‌ సిబ్బంది అక్కడే ఉన్నా వారించ కుండా చోద్యం చూడటం గమనార్హం. ఈ మేరకు అందిన సమాచారంతో విజిలెన్స్‌ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లగా, వారు చూస్తుండగానే ఆయన దర్జాగా మద్యం సీసా పక్కనే పెట్టుకుని భోజనం చేశాడు.

అయినా అతన్ని సిబ్బంది వారించలేదు. ఇంతలో భక్తులందరూ చూస్తుండగానే మణి సీసాæమూత తీసి క్షణాల్లోనే మద్యం సేవించాడు. ఆ తర్వాత నిందితుడిని విజిలెన్స్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తు ఎక్కువ అవడంతో మణి స్పృహకోల్పోయాడు. నిందితుడిని రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశామని తిరుమల ఎక్సైజ్‌ సీఐ మురళీమోహన్‌ తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసుల వైఫల్యం బహిర్గతమైంది. 
 

మరిన్ని వార్తలు