విజిలెన్స్‌ కొరడా...

10 Mar, 2018 12:05 IST|Sakshi
తెరువుపల్లి గోదాంలో కేసు నమోదు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

బియ్యం నిల్వలపై దాడులు

అచ్యుతాపురం/యలమంచిలి రూరల్‌ : విజిలెన్స్‌ అధికారులు బియ్యం అక్రమ నిల్వలపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బృందం శుక్రవారం యలమంచిలి మండలం తెరువుపల్లిలో రైస్‌మిల్లు, మండలంలోని గొర్లె ధర్మవరంలో బియ్యం నిల్వచేసిన ఇంటిపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వచేసిన పౌరసరఫరా బియ్యం గుర్తించారు. బొజ్జ చంద్రం, బొజ్జ నాగరాజులు డిపోల నుంచి బియ్యం కొనుగోలుచేసి కగడల అప్పారావు ఇంట్లో నిల్వచేశారు. ఇక్కడ నుంచి  తెరువుపల్లిలో  ఎస్‌.బాబూరావుకి చెందిన శ్రీసాయి సీతా ట్రేడర్స్‌ రైస్‌మిల్లులో గ్రైండింగ్‌ చేసి ఖరీదైన బియ్యంలో కల్తీ చేసి విక్రయాలు జరుపుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.బియ్యంతోపాటు బొలేరో వ్యాన్‌ని స్వాధీనం చేసుకున్నారు.రూ 5.19 లక్షల విలువైన  12 టన్నుల పీడీఎస్‌ బియ్యం నిల్వలను గుర్తించామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్, ఎమ్మార్వో సుమబాల , హెచ్‌వి ముబారక్‌ పాల్గొన్నారు.

రేషన్‌ బియ్యానికి బహిరంగ వేలం
నక్కపల్లి : మండలంలో చినదొడ్డిగల్లు గ్రామంలో ఆరుమాసాల క్రితం పట్టుబడ్డ సివిల్‌ సప్లయిస్‌ బియ్యాన్ని శుక్రవారం స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాము వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. అప్పట్లో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి సుమారు 12 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వీటిని జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించడంతో స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాము వద్ద భద్రపరిచారు. వీటిని జేసీ ఆదేశాల మేరకు బహిరంగ వేలం నిర్వహించారు. గతంలో వేలం నిర్వహిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర రాలేదు. తిరిగి శుక్రవారం రెండోసారి వేలం నిర్వహించారు. కిలో రూ.15.26 చొప్పున  ఒక వ్యక్తి పాడుకున్నారని సివిల్‌ సప్లయిస్‌ డీటీ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి తదుపరి నిర్ణయిం తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు