గ్యాంగ్‌వార్‌ దాడిలోనే సందీప్‌ చనిపోయాడు: సీపీ

5 Jun, 2020 16:35 IST|Sakshi

బెజవాడ గ్యాంగ్‌ వార్‌లో 13 మంది అరెస్టు

మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన సీపీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్‌ లీడర్‌ పండుతో సహా 13 మంది స్ట్రీట్‌ ఫైటర్స్‌ని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించామని.. త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వెల్లడించారు. (గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు)

సీపీ తిరుమలరావు మాట్లాడుతూ.. ‘పండు గ్యాంగ్‌ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చనిపోయాడు. గతంలో పండు, సందీప్‌ మంచి స్నేహితులు. ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి మధ్య అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్‌, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు.  (పండు.. మామూలోడు కాదు!)

దీంతో పండుకు వార్నింగ్‌ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్‌ ఫోన్‌లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్‌మెంట్‌కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్‌ బెదిరించాడు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్‌ షాపుకు వెళ్లారు. సందీప్‌ షాపులో ఉన్న అనుచరుడిని పండు గ్యాంగ్‌ కొట్టింది. మాట్లాడుకుందాం అని పిలుచుకుని.. 30వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి చాలామంది గాయపడి ఉన్నారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. గ్యాంగ్‌ వార్‌లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు’అని కమిషనర్‌ హెచ్చరించారు. (చదవండి: గ్యాంగ్‌వార్‌ కేసు కొలిక్కి!)

మరిన్ని వార్తలు