మెడపై గాట్లతో విద్యార్థిని అనుమానాస్పద మృతి

14 Feb, 2020 11:04 IST|Sakshi
వివరాలు సేకరిస్తున్న సీఐ శ్రీనివాస్‌ రావు, బాలిక మెడపై గాట్లు

హాస్టల్‌ నుంచి తీసుకెళ్లిన తండ్రి..

ఆయనే చంపేసి ఉండొచ్చని అనుమానం

ఏడేళ్ల క్రితమే బాలిక  తల్లి ఆత్మహత్య  

సాక్షి, వికారాబాద్‌ : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జాంబపూర్‌ తండాలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రవినాయక్‌ కూతురు రేణుక(13) నవాబుపేట మండల కేంద్రంలోని కేజీబీపీ పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. బుధవారం ఉదయం బాలిక అనారోగ్యానికి గురవడంతో ఏఎన్‌ఎం జ్వరం మాత్రలు ఇచ్చింది. అనంతరం బాలిక తండ్రి రవినాయక్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటలకు రవినాయక్‌ హాస్టల్‌కు వెళ్లి కూతురును సదాశివాపేట్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. అయితే, రేణుక తల్లి, రవినాయక్‌ మొదటి భార్య ఏడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య బుజ్జిబాయితో కలిసి సంగారెడ్డి జిల్లా సదాశివాపేట మండలం ఆత్మకూరులో ఉంటూ అక్కడే మేస్త్రిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రేణుకను ఆత్మకూరుకు తీసుకెళ్లినట్లు సమాచారం.  

తండాకు మృతదేహం..  
వసతిగృహం నుంచి రేణుకను తీసుకెళ్లిన రవినాయక్‌.. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వగ్రామం జాంబపూర్‌ తండాకు తీసుకొచ్చాడు. అనంతరం స్థానికులకు విషయం తెలియడంతో రవినాయక్‌ ఇంటికి వచ్చారు. బాలిక మృతదేహాన్ని పరిశీలించగా మెడపై గాట్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. వీఆర్‌ఓ అనిత ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ లక్ష్మయ్య తండాకు చేరుకొని రేణుక మృతదేహాన్ని పరిశీలించారు. తండ్రి రవినాయక్‌ను వికారాబాద్‌ పోలీసులు విచారింగా పొంతన లేని సమాధానాలు తెలిపాడు. బుధవారం రాత్రి రేణుకను ద్విచక్ర వాహనంపై సదాశివపేట్‌కు తీసుకొస్తుండగా నురుగులు కక్కుతూ వాహనం పైనుంచి కింద పడిందని, దీంతో మెడకు గాయాలైనట్లు తెలిపాడు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వికారాబాద్‌ పోలీసులు సదాశివాపేట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన సదాశివాపేట్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి కుటుంబీకుల నుంచి సమచారం సేకరించి తండ్రి రవినాయక్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.  

ఏడేళ్ల క్రితం తల్లి బలవన్మరణం 
రేణుక తల్లి చంద్రిబాయి 7 ఏళ్ల క్రితమే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికే ఆమెకు కూతురు రేణుక, కుమారుడు దర్శన్‌ ఉన్నారు. తల్లి మృతి తరువాత రవినాయక్‌ పిల్లలను ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్చాడు. అనంతరం బుజ్జిబాయిని రెండో వివాహం చేసుకొని సదాశివాపేట్‌ మండలం ఆత్మకూరులో ఉంటున్నాడు. బుధవారం రేణుకను ఆత్మకూరు తీసుకెళ్లిన రవినాయక్‌ రెండో భార్య బుజ్జిబాయి సహాయంతో ఆటోలో మృతదేహాన్ని జాంబపూర్‌కు తీసుకొచ్చారు. రేణుక మెడకు రెండు వైపుల గాట్లు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. తండ్రి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

రేణుక మృతిపై డీఈఓ విచారణ 
నవాబుపేట: రేణుక మృతిపై డీఈఓ రేణుకాదేవి గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విచారణ జరిపారు. రేణుకను హాస్టల్‌నుంచి ఇంటికి ఎందుకు పంపారు...? ఎవరు వచ్చి తీసుకెళ్లారని ఆమె పాఠశాల ప్రత్యేకాధికారిని ఆశలతను, ఏఎన్‌ఎం అనసూయను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక నీరసంగా ఉండటంతో తండ్రి రవినాయక్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చామని, ఆయన మధ్యా హ్నం వచ్చి తన కూతురికి జ్వరంగా ఉందని చెప్పి మూమెంట్‌ రిజిస్టర్‌లో సంతకం పెట్టి సెలవు చిట్టీ ఇచ్చి తీసుకెళ్లాడని వివరించారు. గురువారం ఉదయం రేణుక మృతి చెందినట్లు సమాచారం అందిందని తెలిపారు. అంతకు ముందు తహసీల్దార్‌ వెంకటేశం, ఆర్‌ఐ రవీందర్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు. ఎంఈఓ గోపాల్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు