మహిళా జర్నలిస్ట్‌ దారుణ హత్య

9 Oct, 2018 10:50 IST|Sakshi
దారుణంగా హత్యకు గురైన బల్గేరియా మహిళా జర్నలిస్ట్‌ విక్టోరియా మారినోవా

రూస్ : ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజంతో యూరోప్‌ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బల్గేరియన్‌ మహిళా జర్నలిస్ట్‌ విక్టోరియా మారినోవా దారుణంగా హత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను దుండగులు అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన రూస్ పట్టణంలో చోటుచేసుకుంది. మారినోవా బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్‌లో పొలిటికల్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని వెలికితీసి ఒక్కసారిగా ఐరోపాను ఉలిక్కిపడేటట్టు చేశారు మారినోవా.

ప్రస్తుతం మారినోవా ‘డిటెక్టర్‌’ అనే పొలిటికల్‌ ఇన్వెస్టిగేటివ్‌ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దుండగలు మారినోవాను అమానవీయరీతిలో దారుణంగా హత్య చేశారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపిన కిరాతకులు, పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్‌ సెంటర్‌కు సమీపంలో పడేశారు. అయితే మారినోవా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మారినోవా మృతదేహం సైకియాట్రిక్‌ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి.

మారినోవా హత్య విషయం తెలిసిన బల్గేరియా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ కూడా బల్గేరియాను కోరాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు