కిత్తంపేట–దొండపూడి గ్రామస్తుల నడుమ ఘర్షణ

21 Jan, 2019 06:52 IST|Sakshi
కిత్తంపేట గ్రామస్తులను వారిస్తున్న పోలీసులు

ఉద్రిక్తత, పోలీసుల వారింపు

విశాఖపట్నం, రావికమతం : కిత్తంపేట– దొండపూడి గ్రామాల యువకుల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీంతో కొత్తకోట ఎస్‌ఐ శేఖరం, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అయితే దొండపూడి, కొత్తకోట యువకులు తాగి తమ గ్రామం వచ్చి బైక్‌లతో హల్‌చేయడమే కాక, బీరు బాటిళ్లు పగులగొట్టి కయ్యానికి కాలు దువ్వారని, పోలీసులు చూసినా వారిని మందలించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కిత్తంపేట గ్రామంలో నాలుగురోజుల క్రితం తీర్థం సందర్భంగా దొండపూడి, కిత్తంపేటకు చెందిన ఇద్దరు యువకుల నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా నాలుగు రోజుల అనంతరం వాగ్వాదానికి దిగిన యువకుడు ఆదివారం దొండపూడి గ్రామంలోని మీసేవ కేంద్రానికి రాగా దొండపూడి యువకులు అడ్డగించి బైక్‌ లాక్కుని పంపేశారు.

దీంతో ఆ యువకుడు గ్రామానికి వెళ్లి వారి బంధువులతో విషయం చెప్పగా, వారు బైక్‌ లాక్కున్న యువకులకు ఫోన్‌చేసి మందలించారు. దీనికి ఆగ్రహించిన దొండపూడికి చెందిన 10 మంది యువకులు ఆదివారం సాయంత్రం కిత్తంపేట గ్రామం వెళ్లి బైక్‌లపై గ్రామంలో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. బీరుబాటిళ్లు పగులగొట్టి సవాల్‌ విసరడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై కొత్తకోట పోలీసులకు ఫోన్‌ చేశారు. ఎస్‌ఐ శేఖరం సిబ్బందితో హుటాహుటిన వెళ్లి వారించే ప్రయత్నం చేశారు. అయితే బైక్‌లపై వచ్చి హల్‌చల్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా తమను వారించడం ఏమిటని గ్రామస్తులు పోలీసులపై మండిపడ్డారు. స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ చెప్పడంతో పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి వచ్చేటపుడు దారికాచి తమపై దాడి చేసే అవకాశం ఉందని చెబుతూ గ్రామంలోనే ఫిర్యాదు అందించారు. ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు