ఎంపీపీ భర్తపై గ్రామస్తుల దాడి.. తీవ్ర ఉద్రిక్తత

1 Jul, 2018 13:41 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లాలోని ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదంలో ఓ యువకుడిని చితకబాదారంటూ.. స్థానిక ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి భర్త రమణారెడ్డిపై నారాయణగిరి గ్రామస్తులు దాడికి దిగారు. రమణారెడ్డి, అతని అనుచరుల ఇళ్లపై ఒక్కసారిగా రాళ్లు దాడులు జరిపారు. ఇళ్లపైకి వచ్చి ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి.. ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం గ్రామంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

గ్రామానికి చెందిన సుధీర్‌ అనే యువకుడిపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. సుధీర్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భూవివాదం విషయంలో సుధీర్‌పై రమణారెడ్డే దాడి చేయించాడంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్‌ తాతా పేరుమీద ఉన్న భూమిని కొనేందుకు గతంలో రమణారెడ్డి ప్రయత్నం చేశారు. కొంత అడ్వాన్స్‌ ఇచ్చి ఆ తర్వాత ఆయన వెనుకకు తగ్గారు. ఈ క్రమంలో సుధీర్‌ కుటుంబం రమణారెడ్డి వద్ద అప్పు తీసుకోవడం.. ఆ అప్పు కింద భూమిని తనకు ఇవ్వాలని రమణారెడ్డి ఒత్తిడి తేవడంతో భూవివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే సుధీర్‌పై రమణారెడ్డి దాడి చేయించాడని గ్రామస్తులు అంటున్నారు. తాజా ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో నారాయణగిరి గ్రామం పోలీసుల పహారాలో ఉంది.

మరిన్ని వార్తలు